సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వైట్ కాలర్ ఉద్యోగ నియామకాల్లో క్షీణత

1 గంట క్రితం

layoffs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 09:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మూడో నెలలోనూ 12 శాతం తగ్గుదల

- ఫౌండ్‌ఇట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ రిపోర్ట్‌ వెల్లడి

న్యూఢిల్లీ : దేశీయ కార్పొరేట్ రంగంలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఫౌండ్‌ఇట్ ఇన్‌సైట్స్ ట్రాకర్’ తాజా నివేదిక ప్రకారం.. గత ఏడాది జులైతో పోలిస్తే 2026 జులైలో నియామకాలు 12 శాతం క్షీణించాయి. ఏప్రిల్‌లో 370గా ఉన్న నియామకాల సూచీ మేలో 348కి, జూన్‌లో 331కి, జులైలో 314కి పడిపోయింది. మేలో 4 శాతం, జూన్‌లో 9 శాతం క్షీణత నమోదు కాగా.. జులైలో పరిస్థితి మరింత దిగజారింది.

నైపుణ్యాధారిత మానసిక శ్రమతో కూడిన ఈ ఉద్యోగాల (వైట్‌కాలర్‌)కు సంబంధించి 26 పరిశ్రమలను పరిశీలించగా.. 18 రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గాయి. ఎగుమతులపై ఆధారపడిన రంగాలపై ప్రభావం ఎక్కువగా కనిపించింది. లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్‌లో నియామకాలు 25 శాతం తగ్గగా.. రిటైల్, కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ రంగాల్లో సుమారు 20 శాతం చొప్పున క్షీణత నమోదైంది. ఫ్రెషర్ల నియామకాలు కూడా 10 శాతం ‌పతనమయ్యాయి. సాధారణ వ్యాపారం, సేల్స్, సీనియర్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో నియామకాలు తగ్గుతున్నప్పటికీ.. హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జిసిసి) ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత ఉద్యోగాల వాటా ఎంట్రీ లెవల్ నియామకాల్లో గతంలో 1 శాతం ఉండగా.. ప్రస్తుతం 4 శాతానికి చేరింది. నైపుణ్యాల ఆధారంగా వేతనాల్లోనూ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో మూడింట రెండొంతుల మందికి రూ.5 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం లభిస్తుండగా.. ఎఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ రంగాల్లోని 12 శాతం ఉద్యోగులకు రూ.8 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజీలు లభిస్తున్నాయి. అంటే సాధారణ వైట్ కాలర్ ఉద్యోగాల కంటే అధిక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగాలకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక సూచిస్తోంది. ప్రాంతాల వారీగా చూస్తే కోయంబత్తూర్, జైపూర్, కొచ్చి వంటి టైర్-2 నగరాల్లో నియామకాలు జాతీయ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉండి.. కేవలం 1–2 శాతం మేర మాత్రమే తగ్గాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్