వాషింగ్టన్ : టెక్ దిగ్గజం, టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ సంపాదనలో కొత్త రికార్డ్‌లను నమోదు చేస్తున్నారు. 2025 జులై నుంచి 2026 జులై మధ్య కాలంలో ఆయన రోజుకు సగటున రూ.8,300 కోట్ల (875 మిలియన్ డాలర్లు)కు పైగా సంపాదించినట్లు ‘బెస్ట్ బ్రోకర్స్’ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఈ ఏడాది కాలంలోనే ఆయన వ్యక్తిగత సంపద ఏకంగా 320 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.30 లక్షల కోట్లు) పెరిగింది. ఈ క్రమంలోనే 2026 జూన్ 12న తన ఆధ్వర్యంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన వేళ, మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా (1 లక్ష కోట్ల డాలర్లు లేదా రూ.95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తి) అవతరించారు. అయితే తదుపరి నెలలో స్పేస్‌ఎక్స్ షేర్లు తీవ్ర క్షీణతకు గురవ్వడంతో ఆయన ఆ హోదాను కోల్పోయినప్పటికీ, అంతర్జాతీయ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఎలాన్ మస్క్ తర్వాత అత్యంత వేగంగా ధనాన్ని ఆర్జించిన పారిశ్రామికవేత్తల్లో డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సిఇఒ మైఖేల్ డెల్ నిలిచారు. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద 107.6 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. అదేవిధంగా ఎఐ ప్రభంజనంతో చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్‌ఫెంగ్ సంపద 39.5 బిలియన్ డాలర్ల మేర పెరగడంతో ఆయన ప్రపంచంలోని టాప్-50 అత్యంత ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. మైఖేల్ డెల్, లియాంగ్ వెన్‌ఫెంగ్ తో పాటు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, గియాన్‌కార్లో వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలు కూడా ఈ ఎఐ వృద్ధి ద్వారా సంపదను విపరీతంగా పెంచుకున్నారు.







కామెంట్‌లు (0)