- కేంద్రానికి రూ.10వేల కోట్ల కాసుల వర్షం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దిగుమతి సుంకాల సవరణ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి వినియోగదారులపై తీవ్ర భారాన్ని మోపింది. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచడంతో దాదాపు మూడు నెలల వ్యవధిలోనే పసిడి కొనుగోలుదారుల జేబుల నుంచి కేంద్ర ఖజానాకు ఏకంగా రూ.10,463 కోట్ల అదనపు ఆదాయం వచ్చి చేరింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లను నిరుత్సాహపరిచి, విదేశీ మారకాన్ని కాపాడాలనే వ్యూహంతో ప్రభుత్వం మే 13న కస్టమ్స్ సుంకాలను సవరించిందన్నారు. బంగారం, వెండిపై అప్పటివరకు 6 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 15 శాతానికి పెంచగా, ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. దీంతో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయికి చేరి, పెళ్లిళ్ల సీజన్‌లో ఆభరణాల కొనుగోలుదారులపై, సామాన్య ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం పడింది.
మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య కాలంలో ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం రూ.10,463 కోట్లలో ఒక్క బంగారం దిగుమతుల ద్వారానే వినియోగదారులపై రూ.10,040 కోట్ల భారాన్ని మోపారు. అలాగే వెండి కొనుగోళ్లపై రూ.328 కోట్లు, ప్లాటినంపై రూ.95 కోట్ల మేర పన్నుల రూపంలో చెల్లించుకోవాల్సి వచ్చింది.







కామెంట్‌లు (0)