న్యూఢిల్లీ: అమెరికా ఆంక్షలు తీవ్రమవుతున్నప్పటికీ రష్యా నుంచి తక్కువ ధరలకు లభించే ముడి చమురును భారత్ భారీగా దిగుమతి చేసుకుంటోంది. జులై నెలలో రష్యన్ క్రూడాయిల్ దిగుమతులు వరుసగా రెండో నెలలోనూ రికార్డు స్థాయిని తాకాయి. ప్రముఖ స్వచ్ఛంద పరిశోధనా సంస్థ ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సిఆర్‌ఇఎ)’ నివేదిక ప్రకారం.. జులై నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ఏకంగా 5.5 బిలియన్ యూరోల (దాదాపు రూ.50,000 కోట్లకు పైగా) విలువైన ముడిచమురును కొనుగోలు చేశాయి. ఇది జూన్ నెలతో పోలిస్తే పరిమాణం పరంగా 2.1 శాతం అధికం కావడం గమనార్హం.
ఈ ఏడాది జులైలో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ఇంధనాల్లో ఒక్క ముడిచమురు వాటానే 87 శాతంగా నమోదైంది. జులైలో రష్యా నుంచి వచ్చిన రోజువారీ సగటు దిగుమతులు 28 లక్షల బారెళ్లకు పెరిగాయి. ఆ నెలలో భారత్ చేసుకున్న మొత్తం చమురు దిగుమతుల్లో (దాదాపు 50 లక్షల బారెళ్లు) రష్యా వాటా ఏకంగా 55.5 శాతానికి చేరడం విశేషం. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 2021లో భారత్ రోజుకు కేవలం 1 లక్ష బారెళ్ల లోపు రష్యన్ చమురును మాత్రమే కొనుగోలు చేసేది. 2022 నాటికి ఇది 7.40 లక్షల బారెళ్లకు, 2023లో 18 లక్షల బారెళ్లకు పెరగ్గా, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 28 లక్షల బారెళ్లకు చేరింది. దీంతో చైనా తర్వాత రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.







కామెంట్‌లు (0)