- నిబంధనలపై కేంద్రం మంత్రి మురళీధర్ మోహోల్ స్పష్టత
- అదానీకి అనుకూలంగా విధానాలు...!
- సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ: దేశంలోని విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు ఎయిర్‌లైన్స్‌లో వాటాలు కలిగి ఉండటానికి లేదా నేరుగా విమానయాన వ్యాపారంలోకి ప్రవేశించడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఎలాంటి విధానపరమైన నిషేధం లేదని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) కింద నిర్వహిస్తున్న కొన్ని విమానాశ్రయాల ఒప్పందాల్లో ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్ వ్యాపారాల మధ్య క్రాస్ ఓనర్‌షిప్‌పై పరిమితులు ఉన్నాయని తెలిపింది. సోమవారం రాజ్యసభలో సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రయాణికుల ఎయిర్‌లైన్స్‌లో విమానాశ్రయ నిర్వాహకులు పెట్టుబడులు పెట్టడాన్ని లేదా వాటిని నిర్వహించడాన్ని నిరోధించే నిర్దిష్ట ప్రభుత్వ విధానం లేదని ఆయన తెలిపారు. అయితే కొన్ని పిపిపి విమానాశ్రయాల ఒప్పందాల్లో ఉన్న పరిమితుల నుంచి మినహాయింపు కోరుతూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కి అభ్యర్థన వచ్చినట్లు వెల్లడించారు. దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ అంశంతో ప్రాధాన్యం..
అదానీ గ్రూప్ విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, దాని అనుబంధ సంస్థలు ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు వీలుగా ఒప్పంద పరిమితుల నుంచి మినహాయింపు కోరుతూ అదానీ ఎయిర్‌పోర్ట్స్ జూన్ 4న ఎఎఐకి లేఖ రాసినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా ‘ఎక్స్’లో వెల్లడించారు. కాగా.. ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించే యోచన లేదని అప్పట్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది.
విమానయాన సంస్థల తీవ్ర ఆందోళన..
విమానాశ్రయాలను నిర్వహించే అదానీ లాంటి సంస్థలే నేరుగా విమానయాన వ్యాపారంలోకి అడుగుపెడితే మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీ దెబ్బతినడంతోపాటుగా విమానయాన రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుందని దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విమానాశ్రయ యజమానులు, ఎయిర్‌లైన్ నిర్వహణ బాధ్యతలు రెండూ ఒకే చేతిలోకి వెళ్తే ప్రధానంగా విమానాశ్రయంలో ఇచ్చే కీలకమైన టేకాఫ్, ల్యాండింగ్ స్లాట్లు, పార్కింగ్ బేలు, కౌంటర్ల కేటాయింపుల్లో ఎయిర్‌పోర్టు నిర్వాహకులు తమ సొంత ఎయిర్‌లైన్ సంస్థకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందనేది ఇతర సంస్థల ప్రధాన అభ్యంతరం. దీనివల్ల పోటీ సంస్థల విమానాల వేళల్లో జాప్యం జరగడం, రన్‌వే ప్రవేశంలో వివక్ష ఎదురవ్వడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొంటున్నాయి. అలాగే ఎయిర్‌పోర్టు యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులు (యుడిఎఫ్), ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీల పెంపు ద్వారా పోటీ ఎయిర్‌లైన్స్‌పై అదనపు ఆర్థిక భారం మోపి, తమ సొంత ఎయిర్‌లైన్‌కు రాయితీలు కల్పించే ప్రమాదం ఉందని కూడా ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియాతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.








కామెంట్‌లు (0)