అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాధన్లను కలిసి మెమోరాండం సమర్పించింది. ఈ ప్రతినిధి బృందంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ, కార్యదర్శి జె.వి. మోహన్ గౌడ్, ఖజాంచి కె. రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, కార్యవర్గ సభ్యులు పులి రమణారెడ్డి, ఉప్పాల వెంకట్రావు, ఎం.ఎస్. చౌదరి, అనగాని శ్రీనివాసరావు, బందెపురపు మూర్తి, డి. రోజేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ రావి సౌజన్య పాల్గొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎఫ్‌డీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించి, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.
వినతిపత్రంలోని ప్రధాన డిమాండ్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సెన్సార్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలి.
చిన్న చిత్రాలకు సబ్సిడీ పథకాన్ని తక్షణమే అమలు చేయడంతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న చిత్రాలకు బకాయి సబ్సిడీ విడుదల చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణలు నిర్వహించే సినిమాలకు ఎఫ్‌డీసీ ద్వారా అవుట్‌డోర్ యూనిట్ సదుపాయం కల్పించాలి.
ప్రతి థియేటర్‌లో మధ్యాహ్నం 2:30 గంటల ప్రదర్శనను చిన్న చిత్రాలకు కేటాయించాలి.
థియేటర్లలో టికెట్ ధరలు, తినుబండారాల ధరలను తగ్గించే చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో చిత్రీకరణలు చేపట్టే చిన్న చిత్రాల యూనిట్లకు ప్రభుత్వ వసతి గృహాలను తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలి.
నంది అవార్డుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.








కామెంట్‌లు (0)