సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐదేళ్ల కనిష్టానికి తయారీ రంగం

5 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- జులైలో 53.5కు తగ్గిన సూచీ

- అమ్మకాలు, ఉపాధి కల్పన మందగింపు..

​న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన తయారీ రంగం మందగించింది. డిమాండ్ మందగించడం, కొత్త ఆర్డర్ల నమోదు తగ్గడమే ఇందుకు కారణమని ఎస్అండ్‌పి గ్లోబల్ హెచ్‌ఎస్‌బిసి సంయుక్తంగా విడుదల చేసిన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) తాజా సర్వే గణాంకాలు వెల్లడించాయి. జులై నెలలో ఈ సూచీ సూచీ 53.5కు పరిమితం కాగా, అంతకుముందు జూన్ నెలలో ఇది 54.2గా నమోదయ్యింది. ఆగస్టు 2021 తర్వాత తయారీ రంగం ఈ స్థాయి కనిష్టాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. వ్యాపార కార్యకలాపాలను అంచనా వేసే పిఎంఐ 50కు పైగా ఉండటం రంగం విస్తరిస్తోందని, 50 కంటే దిగువకు వస్తే క్షీణిస్తున్నట్లు సూచిస్తుంది. ఈ సూచీ 50 కంటే పైన ఉంటే వృద్ధిగా పరిగణించినప్పటికీ తయారీ రంగం పెరుగుదల వేగం మాత్రం గణనీయంగా మందగించింది. మొత్తం అమ్మకాలు, ముడిసరుకుల కొనుగోళ్లు, ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాల్లో వృద్ధి వేగం తగ్గినట్లు ఎస్‌అండ్‌పి గ్లోబల్ వెల్లడించింది. 400 కంపెనీల కొనుగోలు విభాగాల అధికారుల స్పందనల ఆధారంగా ఈ సూచీని రూపొందించింది. ​

అయితే తయారీ సంస్థలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముడిసరుకులు, పూర్తయిన ఉత్పత్తుల నిల్వలను పెంచుతున్నట్లు నివేదిక తెలిపింది. సరఫరా చెయిన్‌‌లో సమస్యలు తగ్గుముఖం పట్టడంతో సరఫరాదారుల డెలివరీ సమయాల సూచీ మెరుగైనప్పటికీ, పశ్చిమాసియాలో మళ్లీ రాజుకుంటున్న ఉద్రిక్తతలు ఈ మెరుగుదలపై కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయని హెచ్‌ఎస్‌బిసి చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి తెలిపారు.

​ఉపాధి కల్పన కూడా వరుసగా మూడో నెలలోనూ బలహీనపడింది. ఉద్యోగాల వృద్ధి రేటు అత్యంత మందకొడిగా సాగిందని నివేదిక స్పష్టం చేసింది. ఇదే సమయంలో రవాణా వ్యయాలు పెరగడంతో కంపెనీలు భారాన్ని ఎదుర్కొన్నాయి. ఖర్చుల ఒత్తిడి ఐదు నెలల కనిష్టానికి పడిపోయినప్పటికీ.. కంపెనీలు తమ మార్జిన్లను రక్షించుకునేందుకు ఉత్పత్తుల విక్రయ ధరలను పెంచుతున్నట్లు నివేదిక పేర్కొంది. జూన్ నెలతో పోలిస్తే జులైలో అమ్మకపు ధరలు స్వల్పంగా పెరిగాయని వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్