- సంయుక్త తాత్కాలిక నౌకాయాన కారిడార్” ఏర్పాటు
టెహ్రాన్ : హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా నిర్వహణకు సంబంధించిన ప్రణాళికపై ఇరాన్, ఒమన్ దేశాలు చర్చలు జరిపాయి. ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్-బుసైదీ మంగళవారం టెహ్రాన్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, ప్రతిపాదిత ప్రణాళికలో “సంయుక్త తాత్కాలిక నౌకాయాన కారిడార్” ఏర్పాటు చేయడంతో పాటు, జలసంధిలోని మైన్‌లను తొలగించేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయడం కూడా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో శాశ్వత నౌకా రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, హోర్ముజ్ జలసంధి నిర్వహణపై దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్, ఒమన్‌లు సాంకేతిక చర్చలను కొనసాగించనున్నాయి.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు ప్రారంభించడానికి ముందు, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో దాదాపు ఐదో వంతు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేది. ఇదిలా ఉండగా, ఇరాన్–ఒమన్‌ల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ ప్రణాళికను అమెరికా అంగీకరిస్తుందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఒమన్ అడ్డంకిగా మారితే, ఆ దేశంపై బాంబు దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం హెచ్చరించారు.







కామెంట్‌లు (0)