బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మైక్రోసాఫ్ట్‌లో మరోసారి 'కోతలు'..

01 జులై, 2026

microsoft
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 10:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- వేలాది మందిపై ప్రభావం?

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా దశలో సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతం కంటే తక్కువ మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు బిజినెస్ ఇన్‌సైడర్ విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ వెల్లడించింది. ఈ ఉద్యోగ కోతలను వచ్చే వారం ప్రారంభంలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ వార్తలను మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ నివేదికపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది. అలాగే ఈ సమాచారాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినట్లు రాయిటర్స్ తెలిపింది.

నివేదిక ప్రకారం, ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా సేల్స్, కన్సల్టింగ్ విభాగాలతో పాటు ఎక్స్‌బాక్స్ గేమింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వేలాది మంది ఉద్యోగులు ఈ కోతల పరిధిలోకి వచ్చే అవకాశముందని పేర్కొంది.

అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఒకవైపు ఖర్చులను నియంత్రిస్తూనే, మరోవైపు కృత్రిమ మేధ (AI) మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ధోరణి కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ, మీడియా, ఫైనాన్స్ రంగాల్లో ఇటీవల వరుసగా ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌ గత సంవత్సరం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసి)కు సమర్పించిన పత్రాల ప్రకారం, 2025 జూన్ 30 నాటికి సంస్థలో సుమారు 2.28 లక్షల మంది పూర్తికాల ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగంలో కూడా పునర్వ్యవస్థీకరణ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ కన్సోల్‌ల ధరలను పెంచిన అనంతరం, మార్కెటింగ్‌తో పాటు ఇతర వ్యయాల్లో కోతలు విధిస్తూ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ఈ నెల ప్రారంభంలో బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. అలాగే ఎక్స్‌బాక్స్ యూనిట్‌ను వేరు చేయడం లేదా పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా పునర్వ్యవస్థీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ది ఇన్ఫర్మేషన్ గత నెలలో వెల్లడించింది.

గత 2025 జూలైలో కూడా మైక్రోసాఫ్ట్‌ తన అతిపెద్ద ఉద్యోగ కోతల్లో ఒకటిగా దాదాపు 4 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇతర టెక్ సంస్థలు కూడా ఉద్యోగ కోతల బాటలోనే సాగుతున్నాయి. మెటా ఈ ఏడాది తన ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించే ప్రణాళిక ప్రకటించగా, అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్