- క్యాప్చా వెరిఫికేషన్ పేరుతో స్కామ్‌పై పోలీసుల హెచ్చరిక
తిరువనంతపురం : క్యాప్చా (CAPTCHA) వెరిఫికేషన్ పేరుతో జరుగుతున్న కొత్త తరహా సైబర్ మోసాలపై కేరళ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. 'క్లిక్‌ఫిక్స్' (ClickFix) పేరుతో జరుగుతున్న ఈ సైబర్ స్కామ్ ద్వారా వినియోగదారుల కంప్యూటర్లలోకి చొరబడి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారని హెచ్చరించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొన్ని వెబ్‌సైట్లలో నిజమైన క్యాప్చా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, సైబర్ నేరగాళ్లు నకిలీ డైలాగ్ బాక్స్‌ను ప్రదర్శిస్తారు. అందులో చూపించే సూచనలను అనుసరించేలా వినియోగదారులను మోసగిస్తారు. వినియోగదారులు ఆ సూచనలను అమలు చేస్తే, మోసగాళ్లు వారి కంప్యూటర్‌లోకి ప్రవేశించి బ్రౌజర్‌లో సేవ్ చేసిన ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలు, ఈ-మెయిల్ ఖాతాలు, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను దొంగిలించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, కంప్యూటర్‌లోని డేటాను లాక్ చేసి, తిరిగి అన్‌లాక్ చేయడానికి డబ్బు డిమాండ్ చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. క్యాప్చా వెరిఫికేషన్ పేరుతో పవర్‌షెల్ (PowerShell), కమాండ్ ప్రాంప్ట్ (Command Prompt) తెరవాలని, ఫైళ్లు డౌన్‌లోడ్ చేయాలని లేదా ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలని సూచించే వెబ్‌సైట్లను నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వెబ్‌సైట్లు ఇలాంటి సూచనలు ఎప్పుడూ ఇవ్వవని తెలిపారు.
కంప్యూటర్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయినట్లు అనుమానం వచ్చిన వెంటనే వై-ఫై లేదా ల్యాన్ కనెక్షన్‌ను నిలిపివేసి, పరికరాన్ని ఇంటర్నెట్ నుంచి డిస్‌కనెక్ట్ చేయాలని సూచించారు. అనుమానాస్పద ఫైళ్లను ఇతర కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్లకు పంపకూడదని, ప్రభావిత పరికరాన్ని సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఆన్‌లైన్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని లేదా భారత ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.








కామెంట్‌లు (0)