తాజాగా హెచ్‌ఆర్‌టిసికి 297 వాహనాలు
ప్రజాశక్తి - హైదరాబాద్ : ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ దేశ ఎలక్ట్రిక్ బస్సుల రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. భారత రహదారులపై 4,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన తొలి సంస్థగా నిలిచినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. తాజాగా హిమాచల్‌ప్రదేశ్ సిఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సిఎం ముఖేశ్ అగ్నిహోత్రికి 4,000వ బస్సును ఆ సంస్థ ఎండి మహేశ్ బాబు అందజేశారు. అలాగే హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) కోసం 297 ఎలక్ట్రిక్ బస్సులను సుఖ్‌విందర్ ప్రారంభించారు. దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాల్లో ఒలెక్ట్రా ఇ-బస్సులు ఇప్పటికే ప్రజా రవాణాలో సేవలందిస్తున్నాయని ఆ కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు ఈ బస్సులు కలిపి 73 కోట్ల గ్రీన్ కిలోమీటర్లు ప్రయాణించాయి. దీనివల్ల సుమారు 6.5 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. తక్కువ నిర్వహణ వ్యయం, అధిక సామర్థ్యం కారణంగా ప్రజా రవాణా సంస్థల నుంచి ఇ-బస్సులకు ఆదరణ పెరుగుతోందని పేర్కొంది. ‘4,000 ఇ-బస్సుల మైలురాయి సంస్థతో పాటు దేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి గర్వకారణం. ప్రజా రవాణా సంస్థలు తమపై ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వానికి 4,000వ బస్సుతో పాటు హెచ్‌ఆర్‌టిసికి 297 బస్సులను అందించడం గౌరవంగా ఉంది.’ ఒలెక్ట్రా ఎండి మహేశ్ బాబు తెలిపారు.








కామెంట్‌లు (0)