- మరో ఇద్దరు భారత సంతతి ప్రముఖులు
వాషింగ్టన్ : అత్యంత ప్రభావవంతమైన కేంద్ర బ్యాంకుగా గుర్తింపు పొందిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ద్రవ్య విధానాన్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లలో భారత సంతతికి చెందిన ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ, ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త రాజ్ చెట్టి సహా పలువురు నిపుణులను ఫెడ్ నియమించింది. ఎఐ, మారుతున్న ఉద్యోగ మార్కెట్, ద్రవ్యోల్బణ ధోరణులు వంటి పరిణామాల నేపథ్యంలో ఫెడ్ విధానాలు, డేటా వినియోగం, కమ్యూనికేషన్, ద్రవ్యోల్బణ నియంత్రణ వ్యవస్థలను ఈ కమిటీలు సమీక్షించనున్నాయి. రఘురామ్ రాజన్ ఫెడ్ బ్యాలెన్స్ షీట్ పాలసీ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా వ్యవహరించడం ద్వారా ఫెడ్ ఆస్తులు, వాటి నిర్వహణ, ద్రవ్య విధానంపై వాటి ప్రభావాన్ని పరిశీలించనున్నారు. మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ ఉత్పాదకత, ఉద్యోగాల కమిటీలో సభ్యురాలిగా ఎఐ వంటి ఆధునిక సాంకేతికతలు ఉద్యోగాలు, ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయనున్నారు. రాజ్ చెట్టి ఆర్థిక డేటా నాణ్యత, సమయానుకూలతను మెరుగుపరిచే కమిటీలో పనిచేయనున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ల సిఫార్సులను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఒఎంసి) పరిశీలించి భవిష్యత్ ద్రవ్య విధాన నిర్ణయాల్లో ఉపయోగించనుంది.







కామెంట్‌లు (0)