శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జొన్నగిరి భూ సమీకరణకు ఉత్తర్వులు

1 గంట క్రితం

jonna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 01:44 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- జిఓ విడుదల

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : జొన్నగిరి బంగారు గని ప్రాజెక్టుకు 1,038 ఎకరాల భూమిని సమీకరణ ద్వారా కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భూమిని ప్రభుత్వమే సేకరించి ఇచ్చినా దాని వ్యయం ఖనిజ తవ్వకాల నిర్వహణ సంస్థే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శనివారం పెట్టుబడులు మౌలికాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారు గని ప్రాజెక్టు కోసం ఇప్పటికే జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోని పగిడిరాయి, జొన్నగిరి, ఎర్రగుడి గ్రామాలు, తుగ్గలి మండలాల్లో అమలు కానుంది.

కేటాయించిన భూమిలో ప్రాజెక్టులో తవ్విన బంగారు ఖనిజాన్ని నిల్వ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, గోల్డ్ రికవరీ ప్లాంట్ ఏర్పాటు, వ్యర్థాల నిల్వ కేంద్రాలు, ఖనిజ నిల్వలు, టైలింగ్స్ నిల్వ సదుపాయాలు, అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టనున్నారు. ఇందులోభాగంగానే 1,038 ఎకరాల భూమిని సమీకరణ ద్వారా ఇచ్చేనందుకు నిర్ణయించారు.

​ఇందులో 998.10 ఎకరాల భూమిని భూసేకరణ చట్టం-2013, 2018 మేరకు సమీకరించేందుకు ఆమోదించింది. ఇందులో పట్టా భూములు 749 ఎకరాలు, అసైన్‌మెంట్ భూములు 249.10 ఎకరాలు ఉన్నాయి. దీనికి అదనంగా ఎండోమెంట్స్ శాఖ అనుమతితో మరో 40.12 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని కూడా లీజు ప్రాతిపదికన సంస్థకు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. భూసేకరణ, పునరావాసం, అవసరమైతే రహదారుల పునర్నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని సంస్థే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జొన్నగిరి గోల్డ్ మైన్‌కు ఇప్పటికే 597.82 హెక్టార్ల మైనింగ్ లీజు మంజూరైంది. ఈ లీజు 2043 సంవత్సరం వరకు 30 సంవత్సరాలపాటు పరిమితి ఉంది. ​ప్రాజెక్టులో సుమారు 13 మిలియన్ టన్నుల బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సంవత్సరానికి 0.4 మిలియన్ టన్నుల ఖనిజ ఉత్పత్తి సామర్థ్యంతో గనిని నిర్వహించనున్నారు. గని తవ్వక పరిణామం సుమారు 25 సంవత్సరాలు ఉండగా, భవిష్యత్ అన్వేషణలతో ఇది 30 నుంచి 40 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. ​ఈ గనిలో రోజుకు 1,000 టన్నుల బంగారు ఖనిజాన్ని ప్రాసెస్ చేసే ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ అవసరాల కోసం నున్సురాల సబ్‌స్టేషన్ నుంచి 33 కేవి విద్యుత్ సరఫరా తీసుకోనుండగా, ప్రస్తుతం 5 ఎంవిఎ సామర్థ్యాన్ని భవిష్యత్తులో 10 ఎంవిఎ వరకు పెంచనున్నారు. నీటి అవసరాల కోసం రోజుకు గరిష్ఠంగా 1,640 క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగించనున్నారు. నీటిని హంద్రీ - నీవా సుజల స్రవంతి కాలువ ద్వారా సుమారు 18 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకునేందుకు ఇప్పటికే అనుమతులు పొందారు. జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు దాని విక్రేతలు, సరఫరాదారులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా జిఎస్‌‌టి నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్