- సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : పినికిల్ ప్రైవేటు సంస్థతో ఆర్‌టిసి చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్.కె.జిలాని బాషా, ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రమణ్యం, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.సుందరయ్య, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్‌లతో కలిసి మాట్లాడారు. దేశంలోనే అత్యంత సమర్థవంతంగా ఆర్‌టిసి ప్రజా రవాణా నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు పోరాడి ప్రైవేట్ బస్సులను రద్దు చేయించారని, బస్సుల జాతీకరణ ఉద్యమం ద్వారా ఆర్‌టిసి విస్తరించిందని వివరించారు. అటువంటి ఆర్‌టిసిని రాష్ట్ర ప్రభుత్వం పినికిల్ మెబిలిటీ సర్వీసెస్ అనే పూణే కంపెనీకి కట్టబెట్టాలని కుట్ర చేస్తోందన్నారు. ఆర్‌టిసికి కిలోమీటరుకు రూ.45 మాత్రమే ఆదాయం వస్తోందని, కానీ ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కిలోమీటరుకు రూ.72.37 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు ఆర్‌టిసి డిపోలను ఇప్పటికే ప్రైవేట్‌కు అప్పగించారని, డిపోలన్నీంటినీ క్రమేణా ఈ ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తారని పేర్కొన్నారు. 29 డిపోలలో స్థలాలను అప్పగించాలని ఇప్పటికే ఒప్పందం కుదిరిందన్నారు. పినికిల్ కంపెనీకి విద్యుత్ బస్సులు కొనడానికి రూ.30 లక్షలు చొప్పున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, ఆ సబ్సిడీని ఆర్‌టిసికే ఇవ్వాలని, పినికిల్‌తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2026 డిసెంబరు నాటికి రెండు వేల బస్సులు సర్వీస్ పూర్తవడంతో ఆగిపోనున్నాయని, 750 బస్సులు మాత్రమే కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసికి వేల కోట్ల రూపాయల విలువైన 1,950 ఎకరాల భూములున్నాయని, వాటిని కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు పోరాడుతోందని తెలిపారు. ఆర్‌టిసిలో ఖాళీగా ఉన్న 15 వేల ఖాళీలను భర్తీ చేయాలని, నాలుగు వేల బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని, ఆర్‌టిసికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వివిధ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)