ముంబై: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిల్)ను షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారికంగా తొలగించింది. బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని రెండో షెడ్యూల్ నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించినట్లు ఆర్‌బీఐ అక్టోబర్ 7, 2026న ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జూలై 31న జారీ చేయగా, సెప్టెంబర్‌లో గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ఆర్‌బీఐ చట్టంలోని రెండో షెడ్యూల్‌లో చేర్చిన బ్యాంకులను ‘షెడ్యూల్డ్ బ్యాంకులు’గా పరిగణిస్తారు. ఇవి కేంద్ర బ్యాంకు నిర్దేశించిన ఆర్థిక ప్రమాణాలను పాటిస్తూ కొన్ని ప్రత్యేక బ్యాంకింగ్ సదుపాయాలు పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆ జాబితా నుంచి తొలగించడంతో దాని షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా ముగిసింది. నిబంధనలను పాటించడంలో లోపాల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ గతంలో పలు చర్యలు తీసుకుంది. 2022 మార్చి 11 నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. బ్యాంకు ఐటీ వ్యవస్థపై సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించేందుకు ప్రత్యేక ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని కూడా సూచించింది.
ఆ తర్వాత 2024 జనవరి 31, ఫిబ్రవరి 16 తేదీల్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై మరిన్ని వ్యాపార పరిమితులు విధించింది. ఇప్పటికే ఉన్న ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లలో కొత్త డిపాజిట్లు, క్రెడిట్లు, టాప్‌అప్‌లను అనుమతించకుండా చర్యలు తీసుకుంది.








కామెంట్‌లు (0)