మారుమూల ప్రాంతాల్లోనూ కనెక్టివిటీ..
ధర రూ.1.34 లక్షలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ దేశీయ మార్కెట్లో అధునాతన శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ మొబైల్ టవర్లు పనిచేయని మారుమూల ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, విపత్తు పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా కమ్యూనికేషన్ అందించేందుకు ఈ ఫోన్‌ను రూపొందించింది. అంతర్జాతీయ శాటిలైట్ నెట్‌వర్క్ సంస్థ ఇన్‌మర్‌శాట్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ హ్యాండ్‌సెట్ ధర అన్ని పన్నులతో కలిపి రూ.1,34,166గా నిర్ణయించింది. ఇది సెల్యులార్ టవర్లపై ఆధారపడకుండా నేరుగా ఉపగ్రహాల ద్వారా వాయిస్ కాల్స్‌ను అనుసంధానించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ శాటిలైట్ ఫోన్‌లో అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక ఎస్‌ఒఎస్ ఫీచర్, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే బలమైన నిర్మాణం, ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్షణ దళాలు, సరిహద్దు భద్రతా బలగాలు, సముద్రయాన, విపత్తు నిర్వహణ సంస్థలు, మైనింగ్ ప్రాజెక్టులు, అడ్వెంచర్ ట్రావెలర్లు, పర్వతారోహకులు వంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే వారికి ఈ పరికరం ఉపయోగపడుతుందని బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. అయితే ఈ ఫోన్‌ను సాధారణ మొబైల్ దుకాణాలు లేదా ఆన్‌లైన్ వేదికల ద్వారా కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఆసక్తి ఉన్నవారు సమీప బిఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి ఫోన్‌ను ఏ అవసరానికి వినియోగించనున్నారో పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ నిర్దేశించిన అర్హతలు, అనుమతులు పొందిన తర్వాత మాత్రమే ఈ శాటిలైట్ ఫోన్‌ను వినియోగదారులకు విక్రయించనుంది.








కామెంట్‌లు (0)