ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టాటా సన్స్‌ను లిస్టింగ్‌ చేయాల్సిందే..!

11 గంటల క్రితం

rbi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 09:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆర్‌బిఐ మినహాయింపు తిరస్కరణతో పెరిగిన ఒత్తిడి

ముంబయి : టాటా గ్రూప్‌ ప్రధాన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సిఐసి) నిబంధనల నుంచి మినహాయింపు కోరుతూ టాటా సన్స్ చేసిన దరఖాస్తును ఆర్‌బిఐ తిరస్కరించింది. దీంతో టాటా సన్స్‌ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2022 సెప్టెంబరులో టాటా సన్స్‌ను అప్పర్ లేయర్ నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీగా ఆర్‌బిఐ వర్గీకరించింది. ఈ కేటగిరీలో ఉన్న సంస్థలు నిర్దేశిత గడువులోగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కావాల్సి ఉంటుంది. టాటా సన్స్‌కు ఇచ్చిన మూడేళ్ల గడువు 2025 సెప్టెంబరుతో ముగిసింది. అయితే అప్పటికి కంపెనీ లిస్టింగ్‌ పూర్తి చేయలేదు.

రిజిస్ట్రేషన్‌ రద్దుకు ప్రయత్నం

​తన రుణాలు తీరిపోయిన నేపథ్యంలో సిఐసిగా కొనసాగాల్సిన అవసరం లేదంటూ టాటా సన్స్‌ తన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను సరెండర్‌ చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ దరఖాస్తును కూడా ఆర్‌బిఐ అంగీకరించలేదు. 2026 సెప్టెంబర్‌ 11న పంపిన లేఖలో మినహాయింపు కోరిన టాటా సన్స్‌ అభ్యర్థనను అంగీకరించడం సాధ్యం కాదని ఆర్‌బిఐ స్పష్టం చేసినట్లు సమాచారం.

చైర్మన్‌ మార్పు వేళ..

​టాటా సన్స్‌లో నాయకత్వ మార్పు చర్చలు జరుగుతున్న సమయంలో ఆర్‌బిఐ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత చైర్మన్‌ ఎన్ చంద్రశేఖరన్‌ పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఆయన మరోసారి చైర్మన్‌గా కొనసాగేందుకు సుముఖంగా లేరని బోర్డుకు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టాటా సన్స్‌ భవిష్యత్‌ యాజమాన్య నిర్మాణంతో పాటు లిస్టింగ్‌ అంశం కూడా కీలకంగా మారింది.

వాటాదారుల్లో భిన్నాభిప్రాయాలు

​టాటా సన్స్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న టాటా ట్రస్ట్స్‌ లిస్టింగ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రెండో అతిపెద్ద వాటాదారు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ మాత్రం వాటాల విక్రయం, పబ్లిక్‌ లిస్టింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. లిస్టింగ్‌ జరిగితే టాటా సన్స్‌ యాజమాన్య నిర్మాణం, వాటాదారుల ప్రయోజనాలు, కార్పొరేట్‌ పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది.

భారీ నిధుల సమీకరణకు అవకాశం

​సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ వంటి భారీ పెట్టుబడులు అవసరమైన రంగాల్లో టాటా గ్రూప్‌ విస్తరణకు లిస్టింగ్‌ ద్వారా నిధులు సమీకరించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పబ్లిక్‌ కంపెనీగా మారితే ఆర్థిక వ్యవహారాలు, కార్పొరేట్‌ పాలనలో పారదర్శకత మరింత పెరగవచ్చు. అయితే టాటా గ్రూప్‌ ప్రస్తుత నిర్మాణం, ట్రస్టుల ఆధిపత్యం, దాని సామాజిక సేవా లక్ష్యాలపై లిస్టింగ్‌ ప్రభావం ఎలా ఉంటుందన్నది కీలక ప్రశ్నగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్