- రాఖీ యాడ్ పై కృతికి రాహుల్ గాంధీ మద్దతు
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రకటనపై కొనసాగుతున్న చర్చపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కృతికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన.. మహిళల దుస్తుల ఎంపికపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. “ఒక మహిళ ఏ దుస్తులు ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఎంపిక” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. స్వేచ్ఛగా జీవించే మహిళలను ట్రోల్ చేయడం ఆపాలని సూచించారు.
మరోవైపు, కృతి సనన్‌పై వస్తున్న విమర్శలపై ఆమె సోదరి, నటి నుపూర్ సనన్ కూడా ఘాటుగా స్పందించారు. మహిళ ధరించిన దుస్తుల విషయంలో ఇంతగా ఆందోళన చెందుతూ రాద్ధాంతం చేయడం విచిత్రంగా ఉందని అన్నారు. “దయచేసి కాస్త ఎదగండి. ఆమె నాకు కూడా రాఖీ కడుతుంది. అలాంటప్పుడు నాకు లేని ఇబ్బంది మీకెందుకు?” అంటూ ట్రోలర్స్‌ను ప్రశ్నించారు.
ఇటీవల విడుదలైన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాజకీయంగానూ దీనిపై మాటల యుద్ధం కొనసాగుతోంది. రాఖీ కట్టే సమయంలో కృతి ధరించిన దుస్తులను తప్పుబడుతూ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు చేశారు. సంప్రదాయ భారతీయ పండగకు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియదా అంటూ ప్రశ్నించారు.
దీనిపై కృతి సనన్ కూడా ఘాటుగా స్పందించారు. పండగల అసలు అర్థం తాము ధరించే దుస్తుల్లో కాదని, ప్రేమానురాగాల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ఆమె ప్రశ్నించారు. తాజాగా రాహుల్ గాంధీ కృతికి మద్దతు తెలపడంతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.







కామెంట్‌లు (0)