24.11 టిఎంసిలకు ప్రస్తుతం నిల్వలు 8.60 టిఎంసిలు
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి : ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం వర్షాలు అరకొరగానే పడుతున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్టలో ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న ఏలేరు రిజర్వాయర్‌లో నీరు అడుగంటింది. ఏలేరు పూర్తి సామర్థ్యం 24.11 టిఎంసిలు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 8.60 టిఎంసిల నిల్వలు మాత్రమే ఉన్నాయి. 6.16 టిఎంసిలకు చేరితే డెడ్ స్టోరేజ్ స్థాయికి వెళ్తుంది. ఇదే జరిగితే మెట్టలో సాగునీటి కొరత తీవ్రం కానుంది. ఈ రిజర్వాయర్ కింద 55 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు అక్కడి ప్రజలకు ఏలేరు రిజర్వాయర్ నీరే ఆధారం. డెడ్ స్టోరేజీకి వెళ్తే వారికి తాగునీటి ఇబ్బందులు తప్పవు. ప్రతి సంవత్సరం జూన్ పదో తేదీ నాటికే ఏలేరు జలాలు విడుదల చేసేవారు. దీంతో రైతులు నారుమళ్లు వేసి, జులై మొదటి వారానికి వరి నాట్లు పూర్తి చేసేవారు. కానీ ఈ సంవత్సరం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్ నుంచి 150 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అవి శివారుకు చేరుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో జూన్ 16 నుంచి నారుమళ్లు వేసి, జులై నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నా ఏలేరులో సాగునీటి నిల్వలు లేకపోవడంతో నారుమడులు సిద్ధం చేసుకునే పరిస్థితి కూడా కనిపించడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)