- మార్కెట్లు రెండో రోజూ నేల చూపులు
- 22,850 దిగువకు నిఫ్టీ
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మదుపర్ల సంపదను భారీగా హరించింది. వరుసగా రెండో రోజూ సూచీలు నేల చూపులు చూశాయి. దీంతో కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.11 లక్షల కోట్లు ఆవిరైంది. బుధవారం ఒక్కరోజే మార్కెట్ విలువ రూ.6.15 లక్షల కోట్లు తగ్గి రూ.461.78 లక్షల కోట్లకు చేరింది. ఇంతక్రితం సెషన్‌లో ఇది రూ.467.93 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు అక్టోబర్ 19న కూడా మదుపర్ల సంపదకు సుమారు రూ.5 లక్షల కోట్ల మేర కోత పడింది. ప్రధాన సూచీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లలో పతనం తీవ్రంగా ఉండటం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది. బుధవారం సెషన్‌లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సెన్సెక్స్ 510 పాయింట్లు పడిపోయి 73,351 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయి 22,687 వద్ద ట్రేడయ్యాయి. కాగా.. చివరి గంటల్లో ఐటి షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో నష్టాలు కొంతమేర తగ్గాయి. తుదకు సెన్సెక్స్ 143.21 పాయింట్లు (0.19 శాతం) తగ్గి 73,709.69 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 77.60 పాయింట్లు (0.34 శాతం) నష్టపోయి 22,811.35 వద్ద ముగిసింది. మార్కెట్ పతనంలో ప్రధానంగా చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు దెబ్బతిన్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 2.37 శాతం లేదా 449 పాయింట్లు పతనమై 18,487 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీ 299 పాయింట్లు తగ్గి 21,200 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, బాండ్ రాబడులు ఎగబాకడం, విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) నిరంతర విక్రయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.








కామెంట్‌లు (0)