- నైట్‌ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్
హైదరాబాద్ : నగరంలో నివాస అమ్మకాల్లో మందగమనం చోటు చేసుకుంది. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన ఆగస్టులో హైదరాబాద్‌లో గృహ రిజిస్ట్రేషన్లు 9 శాతం తగ్గి 5,937 యూనిట్లకు పరిమితమయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. జులైతో నూ పోలిస్తే రిజిస్ట్రేషన్లు 4 శాతం తగ్గాయి. గడిచిన ఆగస్టులో మొత్తం లావాదేవీల విలువ రూ.4,576 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాదితో పోలిస్తే 2 శాతం తగ్గినప్పటికీ.. జులైతో పోలిస్తే 3 శాతం పెరిగింది. ధరల వారీగా చూస్తే రూ.50 లక్షలలోపు ఇళ్ల రిజిస్ట్రేషన్లు 12 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఇళ్లు 5 శాతం, రూ.కోటికి పైబడిన ఇళ్లు 8 శాతం చొప్పున తగ్గాయి. అయితే ఖరీదైన ఇళ్ల విభాగంలో లావాదేవీల విలువ మాత్రం 2 శాతం పెరిగి.. మొత్తం లావాదేవీల విలువలో వాటా 51 శాతం నుంచి 54 శాతానికి చేరింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.50 లక్షలలోపు ఇళ్ల వాటా 52 శాతం కాగా, రూ.కోటికి పైబడిన ఇళ్ల వాటా 22 శాతంగా ఉంది.
మరోవైపు 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు హైదరాబాద్‌లో 50,095 గృహాలు రిజిస్టర్ కాగా, వాటి మొత్తం లావాదేవీల విలువ రూ.35,423 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 2 శాతం, లావాదేవీల విలువ 6 శాతం పెరిగాయి. జూన్ 5 నుంచి అమల్లోకి వచ్చిన గైడెన్స్ విలువల సవరణ తర్వాత మార్కెట్‌లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు అస్థిరంగా కొనసాగుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.








కామెంట్‌లు (0)