కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో హిందూపురానికి తరలింపు
ప్రజాశక్తి – హిందూపురం (అనంతపురం) : వియత్నాంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో దుర్మరణం చెందిన హిందూపురం వాసి నల్లపేట రవితేజ పార్థివదేహాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మంగళవారం స్వస్థలమైన హిందూపురానికి తీసుకొస్తున్నారు. విదేశీ గడ్డపై జరిగిన ఈ విషాద ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు చివరి చూపు దక్కేలా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. వియత్నాం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో మృతదేహాలను ముంబైకి తరలించింది. అక్కడ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబై నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో రవితేజ పార్థివదేహాన్ని హిందూపురానికి తరలిస్తున్నారు. అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు రెవెన్యూ శాఖ అధికారి రవీంద్రారెడ్డి కూడా వస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం .... రవితేజ పార్థివదేహం మధ్యాహ్నం 2 గంటల సమయంలో టీచర్స్ కాలనీలోని వారి స్వగృహానికి చేరుకోనుంది. అక్కడ ప్రజలు, బంధుమిత్రులు, సన్నిహితులు చివరి చూపు చూసేందుకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవితేజ మృతితో టీచర్స్ కాలనీతోపాటు హిందూపురం పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.








కామెంట్‌లు (0)