మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరుందురై ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు

53 నిమిషాల క్రితం

Perundurai constituency
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 02:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడులోని పెరుందురై అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నాడిఎంకె అభ్యర్థి ఎస్‌. జయకుమార్‌ ఎన్నికను సవాలు చేస్తూ డిఎంకె అభ్యర్థి తొప్పు ఎన్‌.డి. వెంకటాచలం దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఎన్నికను సవాలు చేసేందుకు చట్టపరంగా అనుమతించదగిన కారణాలు పిటిషన్‌లో లేవని పేర్కొంటూ.. జయకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి డి. భరత చక్రవర్తి అనుమతించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పెరుందురై నియోజకవర్గం నుంచి అన్నాడిఎంకె తరఫున పోటీ చేసిన ఎస్‌. జయకుమార్‌ 9,693 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ఎన్నికను సవాలు చేస్తూ ఆయనపై పోటీ చేసిన డిఎంకె అభ్యర్థి తొప్పు వెంకటాచలం హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు.

తొప్పు వెంకటాచలం దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ జయకుమార్‌ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ డి. భరత చక్రవర్తి.. వెంకటాచలం ఎన్నికల పిటిషన్‌లో చట్టప్రకారం అనుమతించదగిన కారణాలు లేవని నిర్ధారించారు. దీంతో జయకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించి, వెంకటాచలం ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జయకుమార్‌ పెరుందురై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టివికెలో చేరారు. దీంతో పెరుందురై అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. అయితే జయకుమార్‌ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో వెంటనే ఉప ఎన్నిక నిర్వహించడంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పెరుందురైతో పాటు తిరుచ్చి (తూర్పు), అంబాసముద్రం, విరాలిమలై, కరూర్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని మద్రాస్‌ హైకోర్టు గతంలో అడ్డుకుంది. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికైన సభ్యుల విజయాలను సవాలు చేస్తూ ఎన్నికల పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఈ మధ్యంతర ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 24న జరిగిన విచారణలోనూ ఈ ఐదు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్లు పరిష్కారమయ్యే వరకు ఉప ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం తమకు లేదని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్