ఢిల్లీ : నీట్ పరీక్ష అవకతవకలు, పేపర్ లీకేజీలపై గత 23 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మూడు కీలక షరతులను నెరవేరిస్తేనే సోమవారం తన ఫాస్టింగ్ ముగిస్తానని ఆయన స్పష్టం చేశారు. జులై 18న ఆయనను జంతర్ మంతర్ నిరసన స్థలం నుండి పోలీసులు బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
వాంగ్‌చుక్ పెట్టిన 3 కండిషన్లు ఇవే..
దేశంలో ఇటీవల జరిగిన విద్యావ్యవస్థ వైఫల్యాలు, పరీక్ష పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి.
కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకత్వంతో కలిసి తాను పార్లమెంట్ చేరినప్పుడు.. ఎంపీలు, వివిధ పార్టీల నేతలు ఈ విద్యా సంస్కరణల సమస్యను పార్లమెంట్‌లో కచ్చితంగా లేవనెత్తుతామని హామీ ఇవ్వాలి.
ఒకవేళ తన ఆరోగ్యం క్షీణించడం వల్ల లేదా ఇతర అనివార్య కారణాల వల్ల తాను స్వయంగా పార్లమెంట్‌కు వెళ్లలేకపోతే.. రాజకీయ పార్టీల నేతలు, ఎంపీలు ఆసుపత్రికే వచ్చి ఈ అంశాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని భరోసా ఇవ్వాలి.
తాను కేవలం నోటి మాటల ఆధారంగా కాకుండా, లిఖితపూర్వక లేదా స్పష్టమైన హామీల తర్వాతే ఈ దీక్షను ముగిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీల వల్ల దేశంలోని కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని, దీనిపై పార్లమెంట్ లోపల, బయట పోరాటం సాగాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.








కామెంట్‌లు (0)