సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
పదేపదే చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఢిల్లీ పోలీసులు
ఖండించిన ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారిని తీహార్ జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో సిజెపి నేత అజింక్యా షిండేను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మంగళవారం జంతర్ మంతర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించారన్న ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇకపై జంతర్ మంతర్ నిరసనల ప్రదేశంగా ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. మంగళవారం సిజెపికి చెందిన 14 మంది బృందం జనతాదళ్ (యునైటెడ్) కార్యాలయం వెనుక ఉన్న ఇరుకు సందు గుండా వచ్చి, తాళం వేసిన ఇనుప గేటు ఎక్కి నిరసన స్థలంలోకి ప్రవేశించిందని పోలీసులు తెలిపారు. అక్కడ వారు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ నినాదాలు చేశారని, ఆ తర్వాత భద్రతా బలగాలు అడ్డుకున్నాయని చెప్పాయి.ఈ బృందంపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కన్నాట్ ప్లేస్ పోలీసు స్టేషన్లో ప్రభుత్వ అధికారి ఆదేశాల ధిక్కరణ, అక్రమ ప్రవేశం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఒక కేసు నమోదైంది. రెండో కేసును పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో నమోదు చేశారు. మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్న వారిని జఫర్పూర్ కలాన్ పోలీసు స్టేషన్కు, బుధవారం తెల్లవారుజామున పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్కు తరలించారు. ముగ్గురినీ మందిర్ మార్గ్లోని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ‘‘పదేపదే చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందున, బెయిల్పై విడుదలైతే మళ్లీ చట్టాన్ని ఉల్లంఘించి ఇతరులను ప్రేరేపిస్తారన్న తీవ్ర ఆందోళన ఉన్నందున’’ రాంకా, దాస్లకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని పోలీసులు పేర్కొన్నారు. రూ.5వేలు పూచీకత్తుపై షిండేను విడుదల చేశారు. ఏడాది పాటు శాంతికి భంగం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్నది షరతు విధించారు. సిజెపి నేతలను మంగళవారం అర్ధరాత్రి వరకు తమ న్యాయవాదులను కలవడానికి అనుమతించలేదని సిజెపి న్యాయ వ్యవహారాలు చూసే రత్నా సింగ్ తెలిపారు.
త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదు : రాహుల్
సిజెపి నాయకులను అరెస్టును ప్రతిపక్ష నేత నాయకులు రాహుల్ గాంధీ ఖండించారు. శాంతియుత నిరసనలో భాగంగా జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం ‘‘నేరం కాదు’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘దీని కోసం యువతను జైలులో పెట్టడం పిరికితనం. విద్యార్థులు, యువత, పాత్రికేయులు, ‘ఇండియా’ వేదిక.. వేర్వేరు అయినా లక్ష్యం ఒక్కటే. నిరసనలన్నీ ఒక్కటే. రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్న పౌరుల గళం అది. జంతర్ మంతర్ భారత ప్రజలది. మేము దానిని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. దీనికి సిజెపి వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే స్పందించారు. ‘‘అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ల అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు’’ అని తెలిపారు.
ఓటు హక్కును సమర్థించడం నేరమా? : సిపిఎం
సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు) సిపిఎం తీవ్రంగా ఖండించింది. ‘‘ఓటు హక్కును సమర్థించడం ఈ ప్రభుత్వ హయాంలో నేరమా? త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం శాంతికి భంగం కలిగించడమని అమిత్ షా, ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారా?’’ అని ప్రశ్నించింది. వారిని తక్షణమే విడుదల చేయాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని వేధించడం ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది.







కామెంట్లు (0)