బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపికి విరాళాల వరద

51 నిమిషాల క్రితం

bjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 02:35 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.1,473 కోట్లు

- కాంగ్రెస్‌ కంటే ఏడు రెట్లు అధికం

న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాన్యులపై భారాలు మోపుతూ కార్పొరేట్‌ కంపెనీల సేవలో మునిగితేలుతున్న బిజెపికి ప్రతి సందర్భంలోనూ విరాళాలు వరదలా వచ్చిపడుతున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాషాయ పార్టీకి భారీ మొత్తంలో విరాళాలు అందాయి. ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం.. బిజెపి కేంద్ర కార్యాలయానికి దాదాపు రూ.1,473 కోట్లు నిధులు వచ్చాయి. ఎన్నికలు జరిగిన రాష్ర్టాల్లోని బిజెపి రాష్ట్ర విభాగాలకు వచ్చిన నిధులు ఈ మొత్తానికి అదనం. కాంగ్రెస్​ పార్టీ విషయానికి కేంద్ర కార్యాలయానికి, రాష్ట్ర విభాగాలన్నింటినీ కలిపి వచ్చిన విరాళాల మొత్తం రూ.207 కోట్లు మాత్రమే. అంటే బిజెపి కేంద్ర కార్యాలయానికి అందిన నిధులు కాంగ్రెస్ కంటే ఏడు రేట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది అస్సాం, కేరళం, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అంటే మార్చి 15 నుంచి మే 6 వరకు బిజెపి కేంద్ర కార్యాలయానికి రూ.1472.8 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల్లో వెల్లడైంది. అయితే కేరళ, పశ్చిమబెంగాల్ ఎన్నికలకు సంబంధించిన బిజెపి ఖర్చుల నివేదికలు బహిర్గతం కాలేదు. ఆయా రాష్ట్రాల వివారలు కూడా కలిపితే పార్టీ మొత్తం ఆదాయం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ప్రారంభంలో మార్చి 15న బిజెపి కేంద్ర కార్యాలయ ఖాతాల్లో సుమారు రూ.6,722.6 కోట్లు ఉన్నాయి. మే 6 నాటికి ఆ మొత్తం రూ.7,627.2 కోట్లకు చేరింది. అంటే ఎన్నికల వ్యవధిలోనే కేంద్ర కార్యాలయ నిధుల్లో రూ.904.6 కోట్ల పెరుగుదల నమోదైంది. కాంగ్రెస్‌కు అందిన విరాళాలు చూస్తే..ఐదు రాష్ట్రాల పార్టీ విభాగాలు, కేంద్ర కార్యాలయాన్ని కలిపి ఎన్నికల ప్రారంభంలో సుమారు రూ.169.06 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.22.9 కోట్లు నగదు రూపంలో, రూ.146.1 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయి. ఎన్నికలు ముగిసే సమయానికి ఈ మొత్తం సుమారు రూ.103.2 కోట్లకు తగ్గింది. అంటే ఎన్నికల కాలంలో కాంగ్రెస్‌ నిధుల్లో దాదాపు రూ.65.86 కోట్ల క్షీణత నమోదైంది.

బిజెపి ఖర్చు ఎక్కడెంత?

ఇప్పటివరకు బహిర్గతమైన బిజెపి వ్యయ వివరాల ప్రకారం, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో సుమారు రూ.159.7 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.130.4 కోట్లు సాధారణ పార్టీ ప్రచారానికి, మిగిలిన మొత్తం అభ్యర్థులు, ఇతర సంబంధిత ఖర్చుల కోసం వినియోగించింది. అస్సాంలో బిజెపి అత్యధికంగా రూ.96.27 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.76.73 కోట్లు పార్టీ సాధారణ ప్రచారానికి, రూ.19.54 కోట్లు అభ్యర్థుల కోసం ఖర్చయ్యాయి. సాధారణ ప్రచార వ్యయంలో ప్రకటనలకు దాదాపు రూ.37 కోట్లు, స్టార్‌ క్యాంపెయినర్ల ప్రయాణానికి రూ.27.3 కోట్లు ఖర్చయ్యాయి. ఇక తమిళనాడులో బిజెపి రూ.51.56 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.44.51 కోట్లు సాధారణ ప్రచారానికి, రూ.7.05 కోట్లు అభ్యర్థుల కోసం వెచ్చించింది. మీడియా ప్రకటనలకు సుమారు రూ.23.96 కోట్లు, స్టార్‌ క్యాంపెయినర్ల ప్రయాణానికి రూ.10.04 కోట్లు ఖర్చు చేసింది. ప్రచార సామగ్రికి మరో రూ.5.85 కోట్ల వరకు వెచ్చించింది. పుదుచ్చేరిలో బిజెపి మొత్తం రూ.11.90 కోట్ల ఎన్నికల వ్యయాన్ని చూపించింది. ఇందులో రూ.9.19 కోట్లు సాధారణ ప్రచారానికి, రూ.2.71 కోట్లు అభ్యర్థులకు సంబంధించిన ఖర్చులకు వెళ్లాయి.

​కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చు రూ.248.55 కోట్లు

ఇక కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.248.55 కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేసింది. ఇందులో రూ.143 కోట్లు సాధారణ పార్టీ ప్రచారానికి, రూ.105.55 కోట్లు అభ్యర్థుల కోసం ఖర్చు చేసింది. కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయం ఐదు రాష్ట్రాల్లో సాధారణ ప్రచారానికి రూ.40.52 కోట్లు ఖర్చు చేయగా, రాష్ట్ర, స్థానిక విభాగాలు మరో రూ.102.49 కోట్లు వెచ్చించాయి. ఈ వ్యయంలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ సాధారణ ప్రచారానికి రూ.59.28 కోట్లు ఖర్చు చేసింది. అస్సాంలో రూ.22.62 కోట్ల వ్యయం నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్