- ‘అనివార్య కారణాలే’ కారణం
రాయ్పూర్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారుల రెండు రోజుల ఛత్తీస్గఢ్ పర్యటన వాయిదా పడింది. ‘అనివార్య కారణాల’ వల్ల అక్టోబర్ 7, 8 తేదీల్లో జరగాల్సిన పర్యటనను వాయిదా వేసినట్లు మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో ఛత్తీస్గఢ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్)పై విమర్శలు ఎదుర్కొంటున్న జ్ఞానేష్ కుమార్.. ఈసీఐకి చెందిన ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పర్యటనను ఈసీఐ వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి సమాచారం అందింది. “ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషన్కు చెందిన ఇతర సీనియర్ అధికారుల ఛత్తీస్గఢ్ పర్యటన కార్యక్రమాన్ని ఈసీఐ వాయిదా వేసింది. సవరించిన పర్యటన తేదీలు కమిషన్ నుంచి అందిన తర్వాత విడిగా తెలియజేస్తాం” అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం జారీ చేసిన లేఖలో పేర్కొంది.
ఇక పర్యటనలో భాగంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ను రాష్ట్ర అతిథిగా ప్రకటించి, ఆయనకు అవసరమైన ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో దంతేవాడలోని దంతేశ్వరి అమ్మవారి ఆలయం, కబీర్ధామ్లోని భోరండియో ఆలయం, బస్తర్ జిల్లాలోని చిత్రకూట్ జలపాతాన్ని సందర్శించేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. అయితే పర్యటన వాయిదాకు సంబంధించిన కారణాలపై మరిన్ని వివరాలను ఈసీఐ వెల్లడించలేదు. సవరించిన తేదీలను తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.








కామెంట్లు (0)