న్యూఢిల్లీ : జెన్‌జెడ్ తర్వాత ఇప్పుడు జెన్ ఆల్ఫా వంతు వచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కోసం ఇప్పుడు జెన్ ఆల్ఫా తమ గొంతుకను వినిపించడం ప్రారంభించిందని శనివారం ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రాథమిక సౌకర్యాల కోసం నిరసనలు చేస్తున్నారని, హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్, డెహ్రాడూన్, బార్మర్‌లను ఆయన ఉదహరించారు. అక్కడ విద్యార్థులు మెరుగైన రోడ్లు, తగినంత మంది ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 75-80 ఏళ్లు గడిచినా ప్రభుత్వ పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థలో ఉండటం, పైకప్పులు కారుతూ ఉండటం, మరుగుదొడ్లు లేకపోవడం, తాగునీటి కొరత, ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుండటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని అధ్వాన్నమైన పరిస్థితులను ప్రజలు సర్వసాధారణమని భావించి వదిలేశారని, కానీ ఇప్పుడు పిల్లలు ఆ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పంజాబ్‌లోని తమ పార్టీ ప్రభుత్వం అక్కడి పాఠశాలలను ఎంతగానో మెరుగుపరిచిందని, దీంతో అక్కడి విద్యార్థులు ఇప్పుడు నీట్, జేఈఈ పరీక్షలకు హాజరై డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకుంటున్నారని అన్నారు.








కామెంట్‌లు (0)