రాజస్థాన్‌లో రెండు భిన్న ధృవాల ప్రస్థానం
నిఫ్ట్, కాజ్రీలో వినూత్న పరిశోధనలు
యువతకు నైపుణ్య శిక్షణ.. ఎడారి ప్రాంత రైతులకు సాంకేతిక పరిజ్ఞానం
జోధ్‌పూర్ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : ప్రతికూల వాతావరణంలోనూ అన్నదాతకు అండగా నిలుస్తున్న సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కాజ్రీ) ఒకవైపు.. నైపుణ్య ఆధారిత విద్యతో యువతకు సరికొత్త అవకాశాలు కల్పిస్తున్న నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (నిఫ్ట్) మరోవైపు.. వెరసి రాజస్థాన్ లో భిన్న రంగాల్లో సాగుతున్న రెండు కీలక సంస్థల కృషికి అద్దం పడుతున్నాయి. పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో రాజస్థాన్ పర్యటనలో ఉన్న పాత్రికేయ బృందం మంగళవారం జోధ్‌పూర్‌లోని నిఫ్ట్, కాజ్రీలను సందర్శించి వాటి కార్య కలాపాలు, పరిశోధనలు, ఆవిష్కరణలను పరిశీలించింది.
పాత్రికేయ బృందంతో నిఫ్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ జీహెచ్‌ఎస్ ప్రసాద్ ప్రత్యేకంగా సమావేశమై... ఫ్యాషన్‌కు సాంకేతికత జోడింపుతో ఉపాధి, పరిశ్రమల స్థాపన సాధ్యమవుతుందని వివరించారు. విద్యా విధానం, నూతన సాంకేతికత, నైపుణ్య ఆధారిత విద్య, ఉపాధి అవకాశాలపై వివరించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు కేవలం ఫ్యాషన్ డిజైనింగ్‌కే పరిమితం కాకుండా సాంకేతికత, డిజైన్, టెక్స్‌టైల్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని వివరించారు. నిఫ్ట్ విద్యార్థులు రూపొందించిన రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ జట్టు జెర్సీ, పార్లమెంట్ మార్షల్స్ కోసం రూపొందించిన దుస్తులను పాత్రికేయ బృందానికి ప్రదర్శించారు. అనంతరం ప్రయోగశాలలు, శిక్షణా కేం ద్రాలు, ఇన్నోవేషన్ సౌకర్యాలను బృందం పరిశీలించింది.
ఎడారి ప్రాంతాలకు వ్యవసాయ పరిశోధనలు
అనంతరం కాజ్రీని సందర్శించిన పాత్రికేయ బృందం... శుష్క ప్రాంతాల్లో వ్యవసాయానికి అనువైన సాంకేతికత, పంటలు, నీటి సంరక్షణ పద్ధతులు, పశుగ్రాస వనరులపై జరుగుతున్న పరిశోధనలను పరిశీలించింది. కాజ్రీకి చెందిన డా. సురేష్ పాల్ సింగ్ తంవర్.. సంస్థ పరిశోధనా కార్యక్రమాలు, వాటిని రైతులకు చేరువ చేసేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. నర్సరీ, సౌర ఫోటోవోల్టాయిక్ యూనిట్, పంట కోత అనంతర ప్రాసెసింగ్ యూనిట్, ప్రత్యామ్నాయ పశుగ్రాస వనరులు, పైకప్పు వర్షపు నీటి సంరక్షణ పద్ధతులను బృందం పరిశీలించింది. అగ్రి ఎకో టూరిజం పార్క్‌లో ఔషధ మొక్కల పెంపకం, పెసలు, మోత్, గ్వార్, గడ్డి విత్తనాల ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించి శుష్క ప్రాంతాలకు అనువైన పంటలపై జరుగుతున్న పరిశోధనలను పరిశీలించింది.కాజ్రీ శాస్త్రవేత్తలు పరిశోధనలను ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా రైతుల క్షేత్రాలకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పాత్రికేయ బృందం ఆరా తీసింది.







కామెంట్‌లు (0)