కోటాలో ఈ ఏడాదిలో ఎనిమిదో ఘటన
కోటా : నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో నీట్ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటున్న 20 ఏళ్ల విద్యార్థిని ఖూష్బు పటేల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ విద్యార్థిని నీట్ కోసం రెండోసారి సన్నద్దం అవుతున్నారు. జెఇఇ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న తన సోదరితో కలిసి కున్హాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లోనే బలవర్మాణానికి పాల్పడ్డారు. ఆమె చెల్లెలు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో జవహర్ నగర్‌లో తన క్లాసుల నుంచి తిరిగి అపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. తలుపు లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉండటంతో సోదరి ఎంత సేపు తట్టినా స్పందన రాలేదు. దీంతో స్నేహితులు, సెక్యూరిటీ గార్డులు, పొరుగువారి సహాయం కోరింది. తరువాత తాళం చేసే వ్యక్తిని పిలిపించి తలుపు తెరిపించగా, ఆమె సోదరి సృహ లేకుండా కనిపించింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. విద్యార్థిని తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పోస్ట్‌మార్టం అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి కోటాలో ఎనిమది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.







కామెంట్‌లు (0)