రైల్వే స్టేషన్లలో అరెస్టులు
జంతర్ మంతర్‌లోకి మీడియాకూ నిషేధం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీలో శనివారం నిరసనలను అడ్డుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది. మసీదులు, హాస్టళ్లు, పిజి వసతి గృహాల్లోకి వెళ్లి పోలీసులు ప్రజలను బెదిరించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది గోపాల శంకరనారాయణన్ లేవనెత్తారు. నిరసనల్లో పాల్గొనద్దని ప్రజలను కోరే అధికారం పోలీసులకు లేదని అన్నారు. ఢిల్లీలో హాస్టళ్లల్లో పోలీస్ బలగాల తనిఖీలు చేపడుతున్నాయి. హాస్టళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. దీనిపై సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ సుప్రీంకోర్టులో లేవనెత్తారు. పోలీసులు హాస్టళ్లకు వెళ్లే హక్కు లేదని అన్నారు. జంతర్‌మంతర్ నుంచి మీడియా ప్రతినిధులను బయటకు పంపించారు. ఆన్‌లైన్ ట్యాక్సీ యాప్‌లు సహా ఇతర ట్యాక్సీ సేవలపైనా ఆంక్షలు విధించారు. ఆందోళనల్లో పాల్గొనే అవకాశం ఉందని భావించే వారికి హోటళ్లలో గదులు ఇవ్వవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. నిరసనలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు ముద్రించడంపైనా నిషేధం విధించారు. పోస్టర్లు పంపిణీ చేస్తున్న వ్యక్తిని కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వామపక్ష విద్యార్థి సంఘ నేతలపై షాడో పోలీసులు నిఘా పెట్టారు.
రైళ్లు రద్దు.. మెట్రో స్టేషన్ల మూసివేత
న్యూఢిల్లీకి వచ్చే కొన్ని సుదూర రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఢిల్లీ మెట్రోలో 57 స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) తెలిపింది. శుక్రవారం రాత్రి 9 గంటల నుండి శనివారం రాత్రి వరకు మూసివేశారు. నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోనే 35 రైళ్లును రద్దు చేశారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీ, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు వెళ్లే రైళ్లను రద్దు చేశారు. రాజధాని, శివగంగ, న్యూఢిల్లీ సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్ తదితర 50 రైళ్లను పది గంటల పాటు రద్దు చేశారు. నిరసనకారులు ఢిల్లీకి చేరుకోకుండా ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి వచ్చే 20 రైళ్లను రద్దు చేశారు. నిరసనలను అడ్డుకోవడానికి రవాణా మార్గాలనే మూసివేయడం పౌర స్వేచ్ఛపై దాడి అని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ ఉద్యమిస్తున్న విద్యార్థులు, యువజన సంఘాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్య హక్కులపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

విద్యార్థులు, యువత నిర్బంధం
గురువారం అర్థరాత్రి ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లోకి పోలీసులు చొరబడి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నేతలను అరెస్టు చేశారు. అక్కడ పోలీసులు పహారా కొనసాగుతోంది. ఢిల్లీతో పాటు దేశంలోని బిజెపి, ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల్లో పోలీసులు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నేతలను ముందస్తు అరెస్టులకు పాల్పడటం, గృహ నిర్బంధించడం, అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఎ, ఎఐవైఎఫ్, సిజెపి నేతలను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్, ఇటార్సీ, గ్వాలియర్‌లలో ఢిల్లీకి ప్రయాణిస్తున్న విద్యార్థి, యువతను దించేశారు. కనీసం వంద మంది నిరసనకారులను రైళ్ల నుంచి దించి అదుపులోకి తీసుకున్నారు. పుణే నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న సుమారు 22 మంది ఎఐఎస్ఎఫ్ మహిళా విద్యార్థినులను మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీలో నిర్బంధించారు. ఎస్‌ఎఫ్‌ఐ, సిజెపి నాయకులు సహా వేలాది మంది గృహనిర్బంధంలో ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వద్ద రైలును నిలిపివేసి, బిజెపి నాయకుడికి చెందిన రిసార్ట్‌లో నిర్బంధించారు. బిజ్నోర్‌కు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు అభిషేక్, సుల్తాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు సలీల్, సిబిఎస్‌ఇ ఆన్‌స్క్రీన్ మూల్యాంకనంలో అక్రమాలను వెలుగులోకి తెచ్చిన 18 ఏళ్ల అర్జున్ శర్మ కూడా నిర్బంధంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సాహిత్ తండ్రిని నిర్బంధించారు. ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్ఎ, కాంగ్రెస్ నాయకులను కూడా నిర్బంధించారు. మధ్యప్రదేశ్‌లో సిజెపి వాలంటీర్‌తోపాటు ఉన్న పదేళ్ల బాలుడిపైనా పోలీసులు దాడి చేశారు. కాలు విరిగిన స్థితిలో ఉన్న సిజెపి జాతీయ అధికార ప్రతినిధి దీపక్ బలియాన్‌పై రాజస్థాన్ పోలీసులు క్రూరంగా దాడి చేసి, ఆయన ఇంటికి వంద కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టారు.
సిజెపి, విద్యార్థి నేతలకు మహారాష్ట్ర పోలీసుల నోటీసులు
సిజెపి, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల నేతలకు మహారాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆందోళనలో పాల్గొనవద్దని సూచించారు. ఢిల్లీకి వారు ప్రయాణిస్తున్న వివరాలు ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో పాటు ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. ఇదే తరహా చర్యలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతోంది.
యువతకు ప్రభుత్వం భయపడితే దేశాన్నే మూసివేయండి : అభిజిత్ దీప్కే
యువతకు భయపడితే దేశం మొత్తాన్ని మూసివేయాలని సిజెపి కన్వీనర్ అభిజీత్ దీప్కే అన్నారు. జంతర్ మంతర్ నిర్దేశిత ప్రదేశమని, అక్కడ నిరసన తెలిపేందుకు ప్రభుత్వం అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ‘‘యువతకు భయపడితే దేశాన్నే మూసేయండి’’అని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సవరణపై తమ అభ్యంతరాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నిరసనను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని ప్రకటించారు. పోలీసుల నిర్బంధాలు, ఆంక్షలకు భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు. జంతర్‌మంతర్ నిరసనకు వెళ్లే కార్యకర్తలను వివిధ రాష్ట్రాల్లో పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని విమర్శించారు. తమ ఉద్యమానికి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన వారితో కలిపి దేశవ్యాప్తంగా కనీసం 20 వేల మందిని నిర్బంధించారని సిజెపి కో కన్వీనర్ అశుతోష్ రంకా పేర్కొన్నారు.
యువతకు చిరాగ్ పాశ్వాన్ మద్దతు
ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షం ఎల్‌జెపి నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ యువతకు మద్దతు తెలిపారు. హర్యానాలోని సోనిపట్‌లో మాట్లాడుతూ ఇంకెన్ని రైళ్లను ఆపగలరని లేదా రోడ్లను దిగ్బంధించగలరని ఆయన ప్రశ్నించారు. ప్రపంచానికి మార్గం చూపించే సామర్థ్యం యువతకు ఉందని అన్నారు.







కామెంట్‌లు (0)