న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కేంద్రం, యుపి ప్రభుత్వాలతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి నోటీసులిచ్చింది. విరాళాల దుర్వినియోగంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో యథాతథ స్థితిపై (స్టేటస్ కో ) నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని యుపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదేశించింది. సిట్‌లో నియమితులైన సభ్యుల వివరాలు కూడా వెల్లడించాలని హెచ్చరించింది. రామమందిరాన్ని నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి నోటీసులు జారీని వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.
సిసిటివి విజువల్స్, ఇతర రికార్డులను భద్రపరచాలని ఒక పిటిషనర్స్‌లలో ఒకరి తరపు న్యాయవాది కోర్టును కోరారు. అలాగే ప్రభుత్వం సమర్పించే స్టేటస్ రిపోర్ట్ కాపీని తమకు కూడా అందించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. అయితే ధర్మాసనం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. దీనిని తరువాత పరిశీలిస్తామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని పిటిషన్లలో ఒకదానిని స్వయంగా వాదిస్తున్న పిటిషనర్ నరేంద్ర కుమార్ గోస్వామి దాఖలు చేశారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ )తో ఆటిట్ చేయించాలని కోరారు. సిబిఐ విచారణకు సంబంధించి ఇలాంటి ఆదేశాలనే కోరుతూ, అజయ్ కుమార్ రాయ్ మరియు దినేష్ కుమార్ యాదవ్ రెండవ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీరు కూడా స్వయంగా వాదిస్తున్నారు. భక్తులు, దాతల ప్రయోజనాలను పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం , ట్రస్ట్‌లను ఆదేశించాలని కోరారు.







కామెంట్‌లు (0)