గూగుల్ డేటా సెంటర్ బాధిత రైతులను *కలవకుండా అడ్డుకున్న పోలీసులు
ప్రభుత్వ దుశ్చర్యను ఖండిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన
ప్రజాశక్తి - ఆనందపురం (విశాఖపట్నం) : ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ - అదానీ డేటా సెంటర్ భూ సేకరణతో ప్రభావితమైన రైతులు, దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, భీమిలి జోన్ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్.మూర్తిలను తర్లువాడ జాతీయ రహదారిపై పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు జీపులో ఎక్కించి ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమకు అండగా నిలిచేందుకు వస్తున్న సిపిఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖండిస్తూ ఆనందపురం పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత రైతులు, దళితులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం తర్లువాడ ప్రాంతాన్ని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించిందా ? అక్కడికి వెళ్తే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన రైతులు, దళితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక, భూ ప్యాకేజీ, ఉద్యోగ హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. డి-ఫారం భూములున్న వారికి ఎకరానికి 20 సెంట్ల భూమి, రూ.40 లక్షల పరిహారం, శాశ్వత ఉద్యోగం, షాపింగ్ కాంప్లెక్స్ స్థలం, ఇతర బాధిత రైతులకు మూడు సెంట్ల భూమి, రూ.ఐదు లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకుంటే రైతులు, దళితులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ బి.గంగారావు, ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి మాట్లాడుతూ బాధితులు అదనపు డిమాండ్లు చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలే కోరుతున్నారని తెలిపారు. రైతులు, దళితులకు న్యాయం జరిగే వరకు సిపిఎం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు డి.అప్పలరాజు, పి.రాజశేఖర్, భీమిలి జోన్ నాయకులు ఎస్.అప్పలనాయుడు, పంపాన సూర్యనారాయణ, నీలాతి రాము, తర్లువాడ రైతులు, దళితులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)