న్యూఢిల్లీ : బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల సమ్మెతో శుక్రవారం బ్యాంకింగ్ సేవలకు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో సేవలు నిలిచిపోయాయి. వారానికి ఐదురోజుల పనిదినాన్ని తక్షణమే అమలు చేయాలని, వేతనాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధికారులు మరియు ఉద్యోగులలో 90 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే ఏడు సంఘాల సమాఖ్య 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' (యుఎఫ్‌బియు) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చాలా శాఖలు పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడ్డాయి. చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బిలు), కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల శాఖలలో నగదు డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్స్ సహా పరిపాలనాపరమైన సేవలకు అంతరాయం కలిగింది.
అయితే, యుపిఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో సహా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్చి 2024లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ)తో కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ఈ అంశంపై అంగీకారం కుదిరినప్పటికీ, దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ ఇంకా వెలువడాల్సి ఉందని యుఎఫ్‌బియులో భాగమైన 'ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్' (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం తెలిపారు. పెన్షన్ పెంపు, సవరణ, పెన్షనర్లందరికీ ఒకే విధమైన కరువు భత్యం (డిఎ) విధానం, అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) పరిధిలోని ఉద్యోగులకు పాత పెన్షన్ విధానానికి (ఒపిఎస్) మారే అవకాశం కల్పించడం వంటి ఇతర డిమాండ్లు కూడా ఇంకా పరిష్కారం కాలేదని అన్నారు. తమ పట్ల కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం, నెలలోని మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకులు పనిచేస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో 7,000 బ్యాంకు శాఖలలో నిలిచిన సేవలు
దేశవ్యాప్త బ్యాంకు సమ్మె కారణంగా మధ్యప్రదేశ్‌లోని సుమారు 7,000 శాఖలలో శుక్రవారం కార్యకలాపాలు నిలిచిపోయాయని, దీంతో సుమారు రూ.5,500 కోట్ల విలువైన రోజువారీ వ్యాపారం ప్రభావితమైందని సంబంధిత బ్యాంకు ఉద్యోగుల సంఘం తెలిపింది. రాష్ట్రంలోని 8,707 బ్యాంకు శాఖలలో సుమారు 7,000 శాఖలకు చెందిన 42,000 మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారని మధ్యప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ మోహనకృష్ణ శుక్లా తెలిపారు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)