- నా జీవితం తెరిచిన పుస్తకం
- పినరయి విజయన్
అలప్పుజ/కొట్టాయం: తనపై లంచం ఆరోపణలు హాస్యాస్పదమని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్ అన్నారు. నా జీవితం తెరిచిన పుస్తకమని, విష ప్రచారం చేసినంత మాత్రాన నేను లంచగొండినైపోనని స్పష్టం చేశారు. అలాగే, ‘అప్రూవర్ల’ను (సాక్షులుగా మారిన నిందితులను) సృష్టించడం ద్వారా ఇడి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దీన్ని చట్టపరంగానూ, రాజకీయంగానూ ఎదుర్కొంటామని విజయన్ తెలిపారు. బుధవారం అలప్పుజ, కొట్టాయంలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో బుధవారం విజయన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ ‘‘నా కుమార్తెను మధ్యవర్తిగా ఉపయోగించుకుని నేను లంచం తీసుకున్నానన్న ఆరోపణ అత్యంత హాస్యాస్పదం. నా కుమార్తె వీణకు చెందిన కంపెనీ చట్టబద్ధంగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇడి వంటి సంస్థ ఇలాంటి సిగ్గుచేటైన వైఖరిని అనుసరిస్తే, మీడియా దానిని ప్రచారం చేసింది. నాపై కోపం, ద్వేషం, దురుద్దేశంతో కథనాలను వక్రీకరించినంత మాత్రాన నా వ్యక్తిగత జీవితానికి దెబ్బతగలదు’’ అని అన్నారు. ‘ఈ వేధింపుల పర్వం చాలా కాలంగా సాగుతోంది. ఒక రోజు వారు ఏకంగా నేను నివసిస్తున్న ఇంట్లోకి చొరబడ్డారు. కానీ, వారికి ఏమీ దొరకడం లేదు’ అని విజయన్ తెలిపారు. అలాగే, ‘చదువు పూర్తయ్యాక, వీణ ‘ఒరాకిల్’లో చేరి విదేశాల్లోనూ పనిచేశారు. ఆ తర్వాత ఆమె సొంత కంపెనీని ప్రారంభించి వివిధ సంస్థలకు సేవలు అందించారు. సిఎంఆర్‌ఎల్‌కు చెల్లించిన పారితోషికం రహస్యం కాదు, సంబంధించిన పన్నులన్నీ చెల్లించారు’ అని ఆయన తెలిపారు. కరువన్నూర్ బ్యాంక్ కేసు గురించి విజయన్ మాట్లాడుతూ ‘దీనిపై ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం, సహకార శాఖ కఠిన చర్యలు తీసుకున్నాయి. అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి జైలుకు పంపాం. అయితే ఇడి కొందరు నిందితులను ప్రభావితం చేసి, తమకు కావాల్సినట్లుగా చెప్పాలని వారిని ఆదేశించింది. కీలక ఆధారాలు దొరికాయని పేర్కొంటూ, సిపిఎంను నిందితుడిగా చేర్చారు. దేశంలో ఒక రాజకీయ పార్టీని నిందితుడిగా పేర్కొనడం ఇదే మొదటిసారి’ అని తెలిపారు. కేరళ సహకార రంగంలో లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఈ నిధులపైనే కన్నేసిందని తెలిపారు. సహకార రంగాన్ని నాశనం చేసే ప్రయత్నాలను ప్రతిఘటించి, ఓడించాలని విజయన్ పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)