- ప్రతిపక్ష ఎంపీల మార్చ్
- అడ్డుకున్న పోలీసులు.. ఎంపీలను ఈడ్చుకెళ్లి అరెస్టులు
- తొలిసారి నిరసనలో పాల్గొన్న బిజెడి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ప్రతిపక్ష ఎంపీలు భారీ ఆందోళన చేపట్టారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’కు మార్చ్‌గా బయలుదేరిన ‘ఇండియా’ బ్లాక్ ఎంపిలను మార్గమధ్యంలోనే ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకుని రోడ్డుపై ఈడ్చేసాయి. ఎంపీలకు మద్దతుగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకుని, సంఘీభావం తెలిపారు. ఒరిస్సాకు చెందిన బిజెడి ఎంపీలు మానస్ మంగరాజ్, సులతా దేవ్ తొలిసారి ఇండియాబ్లాక్ ఎంపిల మార్చ్‌లో పాల్గొన్నారు. నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకే పాల్గొన్నట్లు మంగరాజ్ తెలిపారు.
మహిళా, వృద్ధ ఎంపిలను ఈడ్చేసిన పోలీసులు
మార్చ్‌లో పాల్గొన్న వృద్ధ ఎంపిలు, మహిళా ఎంపిలను పోలీసులు రోడ్డుపై ఈడ్చేసి, అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొందరి దుస్తులు కూడా చిరిగిపోయాయి. వామపక్ష ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించారు. అమ్రా రామ్, జాన్ బ్రిట్టాస్, ఎ.ఎ. రహీం, ఎస్. వెంకటేశన్, జి. సచ్చిదానందం, పి.పి. సునీర్, జోస్ కె. మాణి తదితర ఎంపీలు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.
వామపక్ష ఎంపీలపై దాష్టీకం
వామపక్షాల పార్లమెంట్ సభ్యులపై ఢిల్లీ పోలీసులు దాష్టీకానికి తెగబడ్డారు. వారి దాడిలో సిపిఎం ఎంపీ ఎ.ఎ రహీం వీపుపై గాయాలయ్యాయి. తొలుత జాన్‌బ్రిట్టాస్, శివదాసన్, ఎఎ రహీంలను ఈడ్చుకెళ్లి బలవంతంగా పోలీసు బస్సుల్లో కుక్కేసారు. ఆ తరువాత వారు మరోసారి రోడ్డుపై ఆందోళన చేయగా, మరోసారి ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత విడుదల చేశారు.
రాహుల్, ప్రియాంక బైఠాయింపు
మార్చ్‌ను అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకాశవాణి భవన్ గేటు దాటి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించారు. వారిద్దరితోపాటు కె.సి.వేణుగోపాల్, దీపేందర్ హుడా, అమరిందర్ సింగ్ రాజా వారింగ్‌లను వ్యాన్‌లోకి ఎక్కించారు. దాదాపు 3వేల మంది ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలను మోహరించి, రహదారులపై పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారని, మీడియా ప్రతినిధులను నిరసన ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చారిత్రాత్మక పోరాటం : జాన్ బ్రిట్టాస్
సిపిఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ "పార్లమెంట్ వీధిలో ఉన్నాం. ఎన్నికల సంఘం కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నాం. ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కోల్పోయింది. ఒక సెకను పాటు కూడా కొనసాగే అర్హత లేదు. ఈ ప్రభుత్వానికి, మోడీ, షా సర్కార్‌కు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ చారిత్రాత్మక ఆందోళన ప్రతిధ్వని ఈ దేశపు నలుమూలలా వినిపిస్తుంది. జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే తొలగించాలి. పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. ఈ దేశానికి నిజమైన శత్రువు మోడీ, షా సర్కార్ చేతిలో రక్షించబడుతున్నాడు. ఈ ఆందోళన దేశాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి. రాబోయే రోజుల్లో మన దేశంలో మరింత ఉత్సాహంతో, అంకితభావంతో, నిబద్ధతతో కూడిన పెద్ద ఎత్తున ఆందోళనలు చూస్తాం" అని స్పష్టం చేశారు.
ఈ పోరాటం నిరంతరం సాగుతుంది : అమ్రారామ్
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, లోక్‌సభ ఎంపి అమ్రారామ్ మాట్లాడుతూ ‘‘జ్ఞానేష్ కుమార్, మోడీ కలిసిపోయి ఉన్నారు. ఈ ఎస్ఐఆర్ చేయడానికి ముందే మోడీ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఎక్కడా పిటిషన్ దాఖలు కాకూడదు, వారిపై ఎలాంటి కేసు నమోదు కాకూడదనే చట్టాన్ని చేసింది. ఆ తరువాత ఎస్ఐఆర్ ద్వారా దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారు. ఓట్లు కోల్పోయిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా విచారకరంగా "తదుపరి అవకాశం ఇవ్వండి" అని చెప్పింది. ఓటు హక్కును హరించే చర్యలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను హతమార్చడమే. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం, దాని సాధనంగా ఉన్న జ్ఞానేష్ కుమార్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ప్రజల ఓట్లను తిరిగి చేర్చాలి. సిఇసిపై దేశద్రోహ చట్టం కింద చర్యలు తీసుకోవాలి. రోడ్లపై నుండి పార్లమెంట్ వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. సాధారణ ప్రజలను జాగృతం చేస్తాం. 13 కోట్ల మంది అంటే, ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు తొలగించడం కంటే పెద్ద రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్య మరొకటి ఉండదు. వారిలో అర్హులందరినీ తిరిగి చేర్చే వరకు, జ్ఞానేష్ కుమార్‌పై దేశద్రోహ చట్టం కింద కేసు పెట్టే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడులు, లాఠీఛార్జి చేసినా... చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. జ్ఞానేష్ కుమార్ కూడా రాజీనామా చేసి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మేము లాఠీలకు, తూటాలకు భయపడేవాళ్ళం కాదు’’ అని స్పష్టం చేశారు.
ఇసి బిజెపి కోసం పనిచేస్తోంది : వి.శివదాసన్
ఎన్నికల సంఘం దేశం కోసం కాకుండా, బిజెపి కోసం పని చేస్తోందని సిపిఎం రాజ్యసభ ఎంపి వి.శివదాసన్ విమర్శించారు. ‘‘దేశంలో ఆందోళనలు ప్రభుత్వ వ్యతిరేక పోరాటంగా, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్నాయి. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థలా దేశం కోసం కాకుండా, కేవలం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల కోసమే పనిచేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, రాజకీయ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి అందరూ కలిసి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై నిలబడ్డాం’’ అని అన్నారు.
జ్ఞానేష్ బ్రో అంతా అయిపోయింది : రాహుల్ గాంధీ
‘జ్ఞానేష్ బ్రో అంతా అయిపోయింది..రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ కలిసి ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని, జ్ఞానేష్ కుమార్ వారికి సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు దేశద్రోహంతో సమానమని, అందరూ త్వరలోనే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నామన్నారు. ఎస్ఐఆర్‌లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 300 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలు ఎన్నికల కమిషనర్లను కలిసేందుకు వచ్చారని, వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎంపిలు కలవాలనుకోవడంతో జ్ఞానేష్ కుమార్ భయపడుతున్నారని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఫారమ్-6 దరఖాస్తులో మార్పులు చేసి ఈసి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు.
ఇసి స్వతంత్రతను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది : ఖర్గే
ఎన్నికల సంఘం స్వతంత్రతను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. మోడీ, అమిత్ షా అనుచరుడిలా సిఇసి జ్ఞానేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని, ఆయనను తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం తరువాత ప్రజలు సాధించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం పోరాడుతుందని అన్నారు. తమ ప్రజాస్వామ్య హక్కులను బలహీనపరిస్తే ప్రజలు మౌనంగా ఉండరని హెచ్చరించారు.
ఎన్నికల్లో అవకతవకలు : అఖిలేష్ యాదవ్
అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ‘ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు ప్రస్తుత ఎస్ఐఆర్ వివాదానికే పరిమితం కాదు. గతంలో కూడా ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణలు వచ్చాయి. 2017, 2019, 2022, 2024ల్లో ఎన్నికల కమిషన్ అవినీతికి పాల్పడింది. బెంగాల్‌లో అయితే ఇది వారు పూర్తిగా బహిరంగంగా ఆడిన ఆట’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎన్నికల అవకతవకలకు ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలు, చండీగఢ్ మేయర్ ఎన్నికలే ఉదాహరణ అని అన్నారు. శివసేన ఎంపి సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఎంపిలు ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి, సిఇసి రాజీనామాకు డిమాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇంతమంది పోలీసులను ఎందుకు మోహరించారని ప్రశ్నించారు.







కామెంట్‌లు (0)