శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఇసి రాజీనామా.. ఎస్‌ఐఆర్‌ నిలిపివేత

2 గంటల క్రితం

indi-1791562720681-8592.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 12:14 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • తిరిగి బ్యాలెట్‌ పేపర్లు..

  • అక్రమాలు రుజువైన అసెంబ్లీలు రద్దు

  • రాష్ట్రపతికి ఇండియా బ్లాక్‌ నేతల వినతి

  • పార్లమెంటు నుండి *రాష్ట్రపతి భవన్‌‌కు మార్చ్‌

  • పోలీసులు అడ్డుకోవడంతో* విజయ్‌ చౌక్‌ వద్ద బైఠాయింపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించి, ప్రజాస్వామ్యానికి తీరని హాని చేసిన సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌‌ చేత రాజీనామా చేయించాలని, తీవ్ర వివాదాస్పదంగా మారిన ఎస్‌ఐఆర్‌‌ను నిలిపివేయాలని ఇండియా బ్లాక్‌ ‌నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు.ఈ మేరకు ఇండియా బ్లాక్ నేత‌ల ప్ర‌తినిధి బృందం రాష్ట్రపతికి శుక్రవారం రాత్రి వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష‌నేత‌లు రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, జ‌మ్ముకాశ్మీర్ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా, ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ, సిపిఎం, సిపిఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఎంఎ బేబీ, డి.రాజా, సుప్రీయా సులే (ఎన్‌సిపి), మ‌నోజ్ కుమార్ ఝా (ఆర్‌జెడి), రాజీవ్ రాయ్ (ఎస్‌పి), తిరుమావళవన్ (విసికె) తదితరులు ఉన్నారు. ఇవిఎంల స్థానంలో బ్యాలెట్‌ ‌పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాలని, ఎన్నికలలో అక్రమాలు రుజువైన రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాలని వినతిపత్రంలో వారు పేర్కొన్నారు. ‘ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. సిఇసి జ్ఞానేష్‌కుమార్‌ నిర్వీర్యం చేస్తున్నారు. కోట్లాది మంది భారతీయుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును హరిస్తూ ప్రజాస్వామ్య పునాదులను దెబ్బ తీస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్రపతిగా మీకు ఉంది. ఆ బాధ్యతను గుర్తించండి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి. మేము లేవనెత్తిన అంశాలపై తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత వ్యవస్థలరను ఆదేశించిండి. ప్రజల గొంతుకలను నొక్కి వేసే చర్యలను అడ్డుకోండి’ అని వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

PTI10_09_2026_000198B.jpg

ఎంపిల మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు

అంతకుముందు పాత పార్ల‌మెంట్ భ‌వ‌నంలోని సెంట్ర‌ల్ హాల్‌లో ఇండియా బ్లాక్ నేత‌లు సమావేశమయ్యారు. ‘ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించండి’ అన్న భారీ బ్యాన‌ర్‌తో పార్ల‌మెంట్ నుంచి విజ‌య్‌ చౌక్‌ వ‌ర‌కు మార్చ్ నిర్వ‌హించారు. సిఇసికి, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. మార్చ్ విజ‌య్ చౌక్ వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపిలతో పాటు ఇతర నేతలు అక్కడే రోడ్డుపైన భైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్ది సేపు ఉద్రిక్తత ఏర్పడింది. అనంత‌రం ఇండియా బ్లాక్ తరపున నేత‌ల ప్ర‌తినిధి బృందం రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్మును కలిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.దేశ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా బ్లాక్ తరపున‌ ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నట్లు వారు రాష్ట్రపతికి తెలిపారు.

అనేక రాష్ట్రాలలో ఓట్‌ ‌చోరి..

హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. మరికొన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఇవిఎంలు), ఓటర్ల జాబితాలను బిజెపి పూర్తిగా తారుమారు చేసిందని వివ‌రించారు. ఎన్నికల అక్రమాలపై ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా హత్య చేస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్‌ కుమార్‌ సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించారని, అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా పోయాయని పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326లో పొందుపరిచిన ఓటు హక్కు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి పునాది .ఎన్నికల కమిషన్‌ ఆ హక్కుకు రాజ్యాంగబద్ధమైన సంరక్షకురాలే తప్ప యజమాని కాదు. ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలే తప్ప రాజకీయ నాయకత్వానికి కాదు. ఓటు హక్కుకు సంబంధించిన నిబంధనలను ఏకపక్షంగా మార్చడం, నిర్ణయాలకు జవాబుదారీతనాన్ని తప్పించుకోవడం, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం వంటి చర్యలను అనుమతించకూడదు.’ అని వినతిపత్రంలో వివరించారు.

1791561004393.jpg.jpg

మరోమార్గం లేకే..

‘ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన కీలక సమయంలో మిగిలిన అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు మాత్రమే దేశ ప్రజలు రాష్ట్రపతిని ఆశ్రయిస్తారు. దేశ‌ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు రాష్ట్రపతి తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను దృఢంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం’ అని వినతిపత్రంలో ఇండియా బ్లాక్‌ ‌నేతలు పేర్కొన్నారు.

వినతిపత్రంలోని కీలకాంశాలు

  • ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి. 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలి.

  • ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి. అక్రమంగా తొలగించిన 13.30 కోట్ల మంది ఓటర్ల పేర్లను వెంటనే పునరుద్ధరించాలి.

  • అన్ని ఎన్నికల్లోనూ కాగితపు బ్యాలెట్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.

  • గత రెండేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలు సమర్పించిన చోట్ల ఆ ఎన్నికలను రద్దు చేయాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్