న్యూఢిల్లీ : 2027 జన గణనలో కులం, కోవిడ్ టీకా, గుర్తింపు పత్రాల వివరాలతో సహా మొత్తం 40 ప్రశ్నలు ఉండనున్నాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వివరాలను మినహాయిస్తే, దేశంలో కులాల గణన చేపట్టడం ఇదే మొదటిసారి. జన గణణ పత్రంలోని 10వ ప్రశ్న షెడ్యూల్ కులం/షెడ్యూల్ తెగ అని ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఏ కులానికి చెందినవారో నమోదు చేయడానికి ఈ ప్రశ్నను అడగనున్నారు. పిఇ దశకు సంబంధించిన రిహార్సల్ లేదా "ప్రీ-టెస్ట్" జూలై 1 నుండి 20 వరకు 16 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించబడింది. ఇందులో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందని వారు తమ కులాన్ని ఒక "ఓపెన్ కాలమ్" (ఖాళీ గడి)లో నమోదు చేశారు, లేదా ఎన్యూమరేటర్ (గణనకర్త) ఆ నివాసి స్వయంగా చెప్పిన కులాన్ని నమోదు చేశారు. తుది దశలోనూ ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
2027 జన గణన సమయంలో అధికారులు అడగాల్సిన ప్రశ్నలను భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ (ఆర్‌జి&సిసిఐ) మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రక్రియలో ఆధార్, మొబైల్ నెంబర్లతో పాటు ఓటర్ ఐడిలు, బ్యాంక్ ఖాతాలు, కోవిడ్-19 టీకా ఎక్కడ తీసుకున్నారు అన్న వివరాలను కూడా సేకరించాలని అన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి 2027లో జనాభా గణన ప్రక్రియ జరగనుండగా, లడఖ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఆగస్టు 17న దీనికి సంబంధించిన రెండో దశ ప్రారంభం కానుంది. ఈ దశకు కొన్ని రోజుల ముందే ఈ ప్రశ్నల వివరాలను ఆయన వెల్లడించారు. 1948 జనగణన చట్టం కింద హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రజల నుండి 40 రకాల సమాచారాన్ని సేకరిస్తారు. కుటుంబ వివరాలు, వ్యక్తిగత సమాచారం, కులం, మతం, విద్య, భాషలు, వైకల్యం, ఉపాధి, వలసలు, పిల్లల వివరాలతో పాటు బ్యాంకు ఖాతాలు, మొబైల్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివరాలను కూడా ప్రశ్నావళిలో సేకరించనున్నారు.
ప్రశ్నావళి
1. వ్యక్తి పేరు
2.కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం
3.లింగం
4. పుట్టిన తేదీ, వయస్సు
5. ప్రస్తుత వైవాహిక స్థితి
6. వివాహం జరిగినప్పుడు వయస్సు
7.జీవిత భాగస్వామి పేరు
8.ప్రకటించిన జాతీయత
9.మతం
10.ఎస్సీ/ఎస్టీ/కులం
11.తండ్రి వివరాలు
12.తల్లి వివరాలు
13.వైకల్యం ఉందా?
14.మాతృభాష, తెలిసిన ఇతర భాషలు
15.అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థాయి
16.విద్యాసంస్థకు హాజరవుతున్నారా?
17.పొందిన అత్యున్నత విద్య, చదివిన విభాగం/విషయం
18.గత ఏడాదిలో ఎప్పుడైనా పనిచేశారా?
19.చేస్తున్న ఆర్థిక కార్యకలాపం
20.వృత్తి
21.పనిచేస్తున్న పరిశ్రమ, వ్యాపారం లేదా సేవా రంగం
22.ఉద్యోగి/కార్మికుడి వర్గం
23.ఆర్థిక కార్యకలాపాలు చేయకపోతే, చేస్తున్న ఇతర కార్యకలాపాలు
24.ఉద్యోగం కోసం చూస్తున్నారా లేదా ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?
25.పని ప్రదేశానికి ఎలా వెళ్తున్నారు?
26.పుట్టిన ప్రదేశం
27.చివరిగా నివసించిన ప్రదేశం
28.వలస రావడానికి కారణం
29.చివరిసారిగా వలస వచ్చినప్పటి నుంచి ఈ గ్రామం/పట్టణంలో నివసిస్తున్న కాలం
30.శాశ్వత నివాస చిరునామా
31.ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న లేదా విడిపోయిన మహిళలకు మాత్రమే)
32.ఇప్పటివరకు జన్మించిన సజీవ పిల్లల సంఖ్య (అదే వర్గానికి చెందిన మహిళలకు మాత్రమే)
33.గత ఏడాదిలో జన్మించిన సజీవ పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత మహిళలకు మాత్రమే)
34.కోవిడ్-19 టీకా ఎక్కడ వేయించుకున్నారు?
35.మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య
36.మొబైల్ నంబర్ (అందుబాటులో ఉంటే)
37.ఆధార్ నంబర్ (అందుబాటులో ఉంటే)
38.ఓటర్ ఐడీ నంబర్ (అందుబాటులో ఉంటే)
39.పాస్‌పోర్ట్ నంబర్ (భారతీయ పాస్‌పోర్ట్ ఉంటే)
40.డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?








కామెంట్‌లు (0)