పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభియోగాలు రుజువయ్యాయని పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలో న్యాయమూర్తుల విచారణా చట్టం కింద ఏర్పడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ మేరకు ఒక నివేదిక అందచేసింది. తనపై వచ్చిన ఆరోపణలకు జస్టిస్ వర్మ ఇచ్చిన వివరణ దాటవేత ధోరణిలో వుందని, సంతృప్తికరంగా లేదని కమిటీ పేర్కొంది. తన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో పెద్ద మొత్తంలో నగదు కట్టలు బయటపడడంపై సంతృప్తికరమైన రీతిలో సమాధానం ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని ఆ నివేదికలో పేర్కొంది.
చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవడాన్ని పరిశీలించడానికి గానూ విచారణలో భాగంగా సేకరించిన కార్యకలాపాల రికార్డు, పత్రాలు, సాక్ష్యాధారాలు ఇవన్నీ కలిపి నివేదికతో అందచేసినట్లు కమిటీ తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్స్ వారి వారి సభల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టారు. దర్యాప్తులో భాగంగా నమోదు చేసిన మౌఖిక, డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలతో పాటూ రెండు సంపుటాలుగా నివేదిక అందచేశారు. గతేడాది మార్చి 14వ తేదీ రాత్రి జస్టిస్ వర్మ అధికార నివాసంలో మంటలు చెలరేగాయి. వెంటనే వాటిని అదుపుచేయడానికి అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగిన సమయంలో ఒక స్టోర్ రూమ్‌లో పెద్ద మొత్తంలో కాలిపోయిన కరెన్సీ కట్టలను కనుగొన్నారు. ఆ తర్వాత వెంటనే ఆయనే రాజీనామా చేశారు. దాంతో జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం రాలేదు. అయితే ఆయన రాజీనామాను న్యాయ మంత్రిత్వ శాఖ ధృవీకరించలేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా వున్న జస్టిస్ వర్మను వివాదం తర్వాత మాతృ కోర్టు అయిన అలహాబాద్ హైకోర్టుకు పంపారు. నగదు దాచి వున్న స్టోర్ రూమ్‌పై జస్టిస్ వర్మ నియంత్రణను కలిగివున్నారని అప్పటి చీఫ్‌జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన సభా కమిటీ నిర్ధారించింది. న్యాయమూర్తిని అభిశంసించాల్సిందిగా కోరుతూ గతేడాది జులైలో 200మందికి పైగా ఎంపీలు అభిశంసన (పార్లమెంట్ తొలగించడం) తీర్మానంపై సంతకాలు చేశారు. వర్మపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తుకు గానూ ఆగస్టులో ముగ్గురు న్యాయమూర్తు లతో విచారణా కమిటీని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి ఒకసారి రాష్ట్రపతికి న రాజీనామా పత్రాలను అందచేసినట్లైతే, ఆ రాజీనామా కాపీని బహిరంగపరిచినట్లతే ఇక ఆ న్యాయమూర్తి రాజీనామా చేసినట్లే భావించాల్సి వుంటుందని, సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, తొలగింపు ప్రక్రియల గురించి తెలిసిన వారు పేర్కొం టున్నారు. న్యాయమూర్తి రాజీనామా అనేది రాష్ట్రపతి ఆమోదానికి లోబడి వుండదు, రాష్ట్రపతి లాంఛనంగా ఆమోదం తెలిపిన తర్వాత న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగం ధృవీకరించాల్సి వుంటుంది.








కామెంట్‌లు (0)