న్యూఢిల్లీ : పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నిరసనకారులు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి విచారణ కమిటీ (హెచ్‌పిఇసి)ని నేరుగా సంప్రదించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సోమవారం తెలిపారు. కమిటీలో నోడల్ అధికారిగా ఒక న్యాయాధికారి ఉంటారని పేర్కొన్నారు. జులై 20న నీట్-యుజి పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా పోలీసు సిబ్బంది తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళా ఆందోళనకారులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీనియర్ న్యాయవాది శోభా గుప్తా కోర్టులో మౌఖికంగా ప్రస్తావించారు. మహిళా నిరసనకారులు పోలీసులపై ఫిర్యాదులు చేసేందుకు, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన, సున్నితమైన వ్యవస్థ అవసరమని న్యాయవాది పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన సిజెఐ, పోలీసుల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే హెచ్‌పిఇసిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా నిరసనకారులు నేరుగా కమిటీని సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. నీట్-యుజి పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల చర్యలు, ఇతర ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి నేతృత్వంలో ఆగస్టు 20న ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మహిళా నిరసనకారులపై లక్షిత హింస, వేధింపులు, లైంగిక వేధింపుల ఆరోపణలను కమిటీ ప్రాధాన్యతా ప్రాతిపదికన విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది. పోలీసు, భద్రతా సిబ్బంది చర్యల వల్ల నిరసనకారులకు జరిగినట్లు ఆరోపిస్తున్న తీవ్ర హాని, గాయాలను కూడా కమిటీ అంచనా వేయాలని ఆదేశించింది.







కామెంట్‌లు (0)