శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశవ్యాప్తంగా ‘క్యా బోల్తీ పబ్లిక్‌’ కార్యక్రమం : సిజెపి ప్రకటన

06 ఆగస్టు, 2026

Dipke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 04:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ‘క్యాబోల్తీ పబ్లిక్‌’ (ప్రజలు ఏం చెబుతున్నారు) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే గురువారం ప్రకటించారు. వచ్చే నెల నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం.. ప్రజలతో మమేకమయ్యేందుకు తోడ్పడుతుందని అన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లోని దీప్కే నివాసంలో గత రెండు రోజులుగా కోర్‌ కమిటీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సిజెపి ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, ప్రతినిధి అశుతోష్ రంకా మరియు ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రచారం ద్వారా దేశంలోని ప్రస్తుత పరిస్థితిపై ప్రజల అభిప్రాయాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోగలుగుతామని అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సిజెపి సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. గత 10-12 ఏళ్లుగా ప్రజల మనసుల్లో ఈ ప్రభుత్వం సృష్టించిన భయం ఇప్పుడు తొలగిపోయిందని అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూల దార్శనికతకు అనుగుణంగా సిజెపి పనిచేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగంలో ఉన్నదే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారిన నిరుద్యోగంపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. దేశంలో 60 శాతం మంది 35 ఏళ్ల లోపు వయసువారేనని, వారంతా నిరుద్యోగులేనని అన్నారు. జంతర్ మంతర్ నిరసనలో విద్యార్థులే కాకుండా ఉద్యోగాలు లేని యువకులు కూడా పాల్గొన్నారని అన్నారు. విద్యా సంస్కరణల కోసం కృషి చేస్తామని అన్నారు. విద్య వ్యాపారంగా మారిందని, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలు విద్యను లాభదాయకమైన సాధనంగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నామని అన్నారు. మీడియా విశ్వసనీయతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని దీప్కే పునరుద్ఘాటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్