ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనగణనా? గూఢచర్యమా?

05 సెప్టెంబర్, 2026

census
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​దేశ జనాభాను లెక్కించాల్సిన జనగణనలో పౌరుల వ్యక్తిగత జీవితంలోకి కేంద్రం ఎందుకు తొంగిచూస్తోంది? తల్లిదండ్రుల పేర్లు, జీవిత భాగస్వామి పేరు, శాశ్వత చిరునామా, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివరాలను సేకరించాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని మాజీ ఉన్నతాధికారులు తమ బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.

- జనాభా లెక్కల పేరుతో వ్యక్తిగత సమాచార సేకరణ

- ఆధార్ నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఎందుకు?

- మోడీ సర్కారు సమాధానం చెప్పాలి

- మాజీ ఉన్నతాధికారులు డిమాండ్

​న్యూఢిల్లీ : దేశంలో 2027 జనగణన పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాభా గణాంకాల కోసం అవసరం లేని వ్యక్తిగత వివరాలను సేకరించడం సరికాదని 108 మంది మాజీ ఉన్నతాధికారులతో కూడిన ‘కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్‌’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జనగణనను పౌరుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసే సాధనంగా మార్చకూడదని హెచ్చరించింది.

​వ్యక్తిగత డేటాపై ఎందుకింత ఆసక్తి?

మాజీ ఉన్నతాధికారుల లేఖలో పేర్కొన్న విషయాల ప్రకారం... 2027 జనగణనలో గతంలో అడగని 12 కొత్త ప్రశ్నలను చేర్చారు. తల్లిదండ్రుల పేర్లు, జీవిత భాగస్వామి పేరు, శాశ్వత నివాస చిరునామా, జాతీయత, కోవిడ్ టీకా తీసుకున్న ప్రదేశం, బ్యాంకు ఖాతాల సంఖ్య, మొబైల్ ఫోన్ వివరాలతో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివరాలను కూడా అడగనున్నారు. ఈ సమాచారంలో చాలా భాగం జనాభా గణాంకాల తయారీకి, ప్రజా విధానాల రూపకల్పనకు పెద్దగా ఉపయోగపడదని మాజీ అధికారులు ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ముందు దాని అవసరం, ప్రయోజనం, వినియోగ విధానాన్ని కేంద్రం స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

​జనగణనకు మించి.. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ భయం

మతం, తల్లిదండ్రుల పుట్టిన ప్రదేశం వంటి ప్రశ్నలు మరో ఆందోళనకు దారితీస్తున్నాయని మాజీ అధికారులు పేర్కొన్నారు. ఈ వివరాలు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను రూపొందించడానికి లేదా నవీకరించడానికి ఉపయోగపడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఎన్‌పీఆర్‌కు ప్రతిపాదిత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)తో సంబంధం ఉన్నందున మరింత అప్రమత్తత అవసరమని వారు సూచించారు. ఎనఆర్‌సీని పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో కలిపి అమలు చేస్తే ముఖ్యంగా ముస్లింలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావచ్చన్న భయాలు ఇప్పటికే ఉన్నాయి.

‘జనగణనను ప్రత్యామ్నాయ మార్గంగా వాడొద్దు’

దేశ పౌరుల రిజిస్టర్ తయారీ వంటి ప్రక్రియ పారదర్శకంగా, ముందుగానే స్పష్టంగా నిర్వచించిన నిబంధనలతో జరగాలని వివరించారు. జనగణనను దానికి ‘ప్రత్యామ్నాయ మార్గంగా’ ఉపయోగించకూడదని తేల్చిచెప్పారు. జనగణనలో సేకరించే ప్రతి సమాచారం చివరకు ఏ గణాంకాన్ని రూపొందించడానికి ఉపయోగపడుతుందో స్పష్టంగా ఉండాని పేర్కొన్నారు.

​భార్యా భర్తల వివరాలపైనా అభ్యంతరం

ప్రత్యేకంగా జీవిత భాగస్వామి పేరు అడగడాన్ని మాజీ అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వానికి జనగణన చట్టం కింద ప్రశ్నలు అడిగే అధికారం ఉన్నప్పటికీ.. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు రాజ్యాంగ పరిరక్షణ ఉందని గుర్తుచేశారు.

​కులగణనపైనా ప్రశ్నలు

2027 జనగణనలో కుల వివరాల సేకరణ విధానంపైనా మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా వారు ఏ వర్గానికి చెందినవారో అడగడంతో పాటు ఇతర కులాల కోసం ఓపెన్-ఎండెడ్ ప్రశ్నను ఉంచుతున్నారు. అయితే డీనోటిఫైడ్, నోమాడిక్, సెమీ-నోమాడిక్ కమ్యూనిటీల సంఖ్యను ఈ విధానం ద్వారా విశ్వసనీయంగా గుర్తించడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు.

​వ్యక్తిగత వివరాల సేకరణకు కారణం చెప్పాలి

జనాభా లెక్కల పేరుతో పౌరుల నుంచి సేకరిస్తున్న ప్రతి వ్యక్తిగత వివరానికి కారణం ఏమిటో కేంద్రం చెప్పాలని మాజీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. జనగణన గణాంకాల కోసం అవసరమైన సమాచారానికే పరిమితం కాకుండా వ్యక్తిగత డేటాను విస్తృతంగా సేకరిస్తే, భవిష్యత్తులో ఆ డేటా ఎలా ఉపయోగించబడుతుందనే ప్రశ్న తప్పదని వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్