తిరువనంతపురం : కేరళ యుడిఎఫ్‌లో వర్గపోరు తీవ్రతరమైంది. తిరువనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ(డిసిసి)సభ్యుడు అనిల్ కుమార్‌ను పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ కాన్వాయ్‌ను శుక్రవారం అడ్డుకుని,ఆయనతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై శ్రీకార్యం పోలీసులు కేసు నమోదు చేశారు. చెంపాజంతిలోని శ్రీనారాయణ గురుకులంలో జరగాల్సిన జయంతి వేడుకలకు సతీశన్ వెళ్తుండగా కజకూట్టం సమీపంలో అనిల్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపింది. నిరసనకారులతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కారు దిగిన సమయంలో వారు ఆయనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే,ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి అధికారిక షెడ్యూల్‌లో లేదని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కార్యక్రమానికి హాజరుకావద్దని సతీశన్‌కు సూచించారని,తాము హాజరు కాలేమని నిర్వాహకులకు వారం రోజుల ముందే సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాయి.
అనిల్ ఖండన
తనపై వచ్చిన ఆరోపణలను అనిల్ కుమార్ ఖండించారు.అక్రమంగా అడ్డుకోవడం,బెదిరించడం,ప్రభుత్వ ఉద్యోగులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం తదితర అభియోగాలపై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.అనిల్‌ను శనివారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అనిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు తిరువనంతపురం డిసిసి ఇన్‌చార్జి అధ్యక్షుడు ఎన్.సక్తాన్ ప్రకటించారు.







కామెంట్‌లు (0)