మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరంకుశత్వానికి దీటైన సమాధానం

11 గంటల క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 01:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- శాంతియుత నిరసనపై పోలీసు హింసకు సిపిఎం ఖండన

​న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పిలుపు మేరకు, విద్యార్థి సంఘాల మద్దతుతో సోమవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు చేపట్టిన ‘‘సంసద్ చలో’’ భారీ ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు, యువతను సిపిఎం పొలిట్‌బ్యూరో అభినందించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌‌తో నెల రోజులకు పైగా సాగుతున్న ఉద్యమానికి మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుకు ఈ భారీ జనసమీకరణ దీటైన సమాధానంగా నిలిచిందని సిపిఎం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పోలీసులు నిరసనకారులపై చేసిన దాడుల్లో పలువురు విద్యార్థులు, యువకులు గాయపడ్డారని, వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని పార్టీ తెలిపింది. గోల్ మార్కెట్‌లోని సిపిఎం కేంద్ర కార్యాలయం ఎదుట కూడా లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగించారని వెల్లడించింది.

నీట్ పరీక్ష పేపర్ లీక్‌ల వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టిఎ)ను రద్దు చేయాలన్న డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం మొండిగా తిరస్కరిస్తుండటంతో, దేశవ్యాప్తంగా నెల రోజులుగా సాగుతున్న నిరసనల్లో పెద్ద ఎత్తున ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువత భాగస్వాములయ్యారని సిపిఎం తెలిపింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు, సంఘీభావం లభించినప్పటికీ బిజెపి ప్రభుత్వం ఈ డిమాండ్లను పట్టించుకోలేదని పేర్కొంది.

నిరాహార దీక్ష అనంతరం సోమవారం జరిగిన పోలీసు చర్య దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఊతమిచ్చిందని, విద్యా రంగంలో పెరుగుతున్న గందరగోళం, నిరుద్యోగ సమస్యపై జవాబుదారీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, అందుకు బదులుగా భయాందోళనలతో నిరసనకారులతో చర్చలకు నిరాకరించిందని సిపిఎం ప్రకటనలో విమర్శించింది.

ఇలాంటి అణచివేత చర్యల ద్వారా, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆగ్రహాన్ని, అసంతృప్తిని బిజెపి ప్రభుత్వం అణచివేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం హెచ్చరించింది. తక్షణమే విద్యార్ధుల డిమాండ్లను మోడీ ప్రభుత్వం అంగీకరించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి వైదొలగాలని, ఎన్‌టిఎను రద్దు చేయాలని, అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని సిపిఎం కోరింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్