- స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా ప్రచారానికే ..
- దేశంలో విద్య-ఉపాధి మధ్య తీవ్ర అంతరాలు
-‘నీతి ఆయోగ్’ తాజా నివేదికలో కీలక విషయాలు
న్యూఢిల్లీ : భారత్‌లో విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నా.. ఆ విద్య యువతకు నాణ్యమైన ఉపాధిగా మారడం లేదు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘రీఇమేజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ 2047’ పేరుతో ఆగస్టు 18న విడుదల చేసిన నివేదికలో దేశ విద్యా వ్యవస్థ, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ మార్కెట్ మధ్య ‘అనుసంధాన లోపం’ (ఫండమెంటల్ డిస్‌కనెక్ట్) ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఇది కేవలం నిరుద్యోగ సమస్య కాదనీ, విద్యార్థులు ఏండ్ల తరబడి చదివి డిగ్రీలు సంపాదించిన తర్వాత కూడా ఉద్యోగానికి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని నివేదిక వివరిస్తోంది.
డిగ్రీ ఉంది.. కానీ ఉద్యోగానికి సరిపడే నైపుణ్యం ఎక్కడ?
2024-25 ఆర్థిక సర్వేలోని గణాంకాలను నిటి ఆయోగ్ ప్రస్తావించింది. గ్రాడ్యుయేట్ స్థాయి విద్య ఉన్న వారిలో 8.25 శాతం మంది మాత్రమే హై-కాంపిటెన్సీ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో ఉన్నట్టు ఆర్థిక సర్వేలోని విద్య–ఉద్యోగ నైపుణ్యాల గణాంకాలను వెల్లడించింది. మరో 38.23 శాతం మంది ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాల్లో ఉండగా, 50.3 శాతం మంది సెమీ-స్కిల్డ్ ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే.. ఉన్నత విద్య పూర్తిచేసిన యువతలో చాలా మంది తాము చదివిన స్థాయికి తగ్గ నైపుణ్యాన్ని ఉపయోగించుకునే ఉద్యోగాల్లోకి వెళ్లలేకపోతోందన్నమాట.
బిఎ, బికాం, బిఎస్‌సి.. ఆ తర్వాత?
భారత్‌లో ఉన్నత విద్యలో సాధారణ డిగ్రీ కోర్సుల వాటా భారీగా ఉంది. సుమారు 3.4 కోట్ల మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 1.13 కోట్ల మంది ఒక్క బిఎలోనే చదువుతున్నారు. బిఎ, బిఎస్‌సి, బికాం కలిపి 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ కోర్సుల్లో అనేక వాటికి ఉద్యోగ మార్కెట్‌తో బలమైన అనుసంధానం లేదని నిటి ఆయోగ్ పేర్కొంది. ముఖ్యంగా సాధారణ బిఎ, బిఎస్‌సి, బికాం డిగ్రీలు నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకెళ్లే మార్గాన్ని స్పష్టంగా చూపడం లేదని నివేదిక విశ్లేషించింది. ఉద్యోగానికి వెళ్లిన తర్వాత డిజిటల్ స్కిల్స్ వంటి అదనపు నైపుణ్యాలు కూడా అవసరమవుతున్నాయని వివరించింది.
ఆశించిన ఫలితాలు లేవు
మోడీ ప్రభుత్వం 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతామని చెప్తోంది. కానీ ఆ లక్ష్యానికి పునాది అయిన యువత విద్య, నైపుణ్యాలు, ఉపాధి మధ్య సంబంధం ఇప్పటికీ బలహీనంగానే ఉందని ప్రభుత్వ విధాన సంస్థే చెప్తోంది. నిటి ఆయోగ్ నివేదిక ప్రకారం... 2014-15 నుంచి 7.67 కోట్ల మందికి పైగా నైపుణ్య శిక్షణ అందించారు. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా నైపుణ్యాభివృద్ధికి రూ.34,000 కోట్ల కేటాయింపులు జరిగాయి. అయినప్పటికీ ఫలితాలు ఆశించినంతగా లేవని పేర్కొంది.
ప్రాక్టికల్ అనుభవం కరువు
యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రాక్టికల్ అనుభవం, పరిశ్రమల పరిచయం ప్రధానమైనవిగా నివేదిక గుర్తించింది. డిగ్రీ సమయంలో ఆచరణాత్మక అనుభవం, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ కొరవడటం విద్యార్థులను ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం కాకుండా చేస్తోంది. ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు ఈ లోటును భర్తీ చేయగలవని నిటి ఆయోగ్ వివరిస్తోంది. అయితే అవి కేవలం పేరుకే కాకుండా వాస్తవ పని, శిక్షణ, అనుభవాన్ని అందించేలా ఉండాలని కూడా హెచ్చరిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఎందుకు పరుగులు?
విద్యకు తగ్గ ప్రయివేటు ఉద్యోగ మార్గాలు స్పష్టంగా కనిపించకపోవడం, ఉద్యోగ భద్రతపై ఆందోళన, ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్మకం.. ఇవన్నీ కలిపి యువతను ప్రభుత్వ నియామకాల వైపు వెళ్లేలా చేస్తున్నాయి. నీతి ఆయోగ్ నివేదికలో ప్రస్తావించిన గణాంకాల ప్రకారం... నవంబర్ 2024 నుంచి జులై 2025 మధ్య కేవలం 55 వేల ప్రభుత్వ పోస్టులకు 1.86 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇది కేవలం పోటీ పరీక్షలపై యువతకు ఉన్న మోజు కాదనీ, చదువు పూర్తయిన తర్వాత స్థిరమైన, గౌరవప్రదమైన జీవనోపాధి కోసం యువత ఎదుర్కొంటున్న అస్థిరతకు ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.
బాధ్యత ఎవరిది?
గత దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో అనేక పథకాలు, విధానాలు ప్రకటించింది. ‘స్కిల్ ఇండియా’, ‘మేకిన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’, ‘వికసిత్ భారత్’ వంటి భారీ నినాదాలనే వినిపిస్తోంది. కానీ డిగ్రీ పూర్తిచేసిన యువతకు మాత్రం తమ చదువుకు తగ్గ ఉద్యోగం మాత్రం దొరకడం లేదు. ‘‘యువతను కేవలం పరీక్షలు రాసే అభ్యర్థులుగా, ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూలో నిలబడే నిరుద్యోగులుగా చూడటం సమస్యకు పరిష్కారం కాదు. విద్యార్థి చదువుతున్నప్పుడే పరిశ్రమలతో అనుసంధానం, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, కెరీర్ గైడెన్స్, డిజిటల్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ అందుబాటులో ఉండాలి’’ అని నిపుణులు సూచిస్తున్నారు.
నినాదాల కంటే ఫలితాలే ముఖ్యం
పాఠశాల స్థాయి నుంచే ఉద్యోగ, వ్యాపార నైపుణ్యాలను పెంచడం, విద్యను పరిశ్రమతో అనుసంధానించడం, అప్రెంటిస్‌షిప్‌లను విస్తరించడం, నైపుణ్య ఆధారిత నియామకాలను ప్రోత్సహించడం, శిక్షణ ఫలితాలను ఉద్యోగాలు–వేతనాల ఆధారంగా కొలవడం వంటివి చేపట్టాలని నీతి ఆయోగ్ సూచించింది. ఇవి అమలైతేనే మోడీ సర్కారు చెప్పే ‘వికసిత్ భారత్’ నినాదానికి అర్థం ఉంటుందనీ, లేకపోతే కోట్లాది మంది యువత చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం అంతులేని నిరీక్షణ మాత్రమే మిగిలే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.







కామెంట్‌లు (0)