- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థి నేత
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళల్లో పాల్గొంటున్న ఎఐఎస్ఎ అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసు ఇచ్చారు. ఆ నోటీసును సవాల్ చేస్తూ నేహా బోరా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ కాలంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రూ.10 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు పూచీకత్తు సమర్పించాలని పోలీసులు జారీ చేసిన నోటీసును ఆమె సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ఆమె తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఈ నెల 16న ఢిల్లీలోని మండి హౌస్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకని, మరుసటి రోజు ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఆమెకు శాంతి బాండ్ నోటీసు జారీ చేశారు. సోమవారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని, రూ.10 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు ఒక పూచీకత్తు సమర్పించాలని అందులో పేర్కొన్నారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్)లోని సంబంధిత నిబంధనల ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు. అయితే, తనపై జారీ చేసిన నోటీసులో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాన్ని నిరూపించే ఆధారాలు లేవని నేహా బోరా తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని, శాంతిభద్రతలకు ఎప్పుడు, ఏ సందర్భంలో భంగం కలిగే అవకాశం ఉందో నోటీసులో స్పష్టంగా పేర్కొనలేదని నేహా బోరా తన పిటిషన్‌లో తెలిపారు. అయతే, దసరా సెలవుల కారణంగా ఢిల్లీ హైకోర్టు మూసి ఉండటంతో అత్యవసర విచారణ కోసం ఆమె తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.







కామెంట్‌లు (0)