న్యూఢిల్లీ : నీట్-యుజి ఆందోళనల్లో ప్రజల భద్రత కోసమే ముఖ గుర్తింపు ( ఫేషియల్ రికగ్నిషన్) సాంకేతికను వినియోగించినట్లు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇది చట్టబద్ధమేనని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే నిరసనకారులపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) పెల్లెట్ గన్‌లను వినియోగించిన అంశాన్ని ఆ అఫిడవిట్‌లో ప్రస్తావించలేదు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు తాము తగినంతగా, సహేతుకంగా, దశలవారీగా, చట్టానికి పూర్తి అనుగుణంగా చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. "పోలీసులు బల ప్రయోగానికి సంబంధించిన అన్ని అంశాలను " పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రతిపాదించిన కమిటీ ముందు, పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వ్యవహారాలను తాము పరిష్కరించుకుంటామని వారు పేర్కొన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) వినియోగించడం చట్టబద్ధమైన, నమ్మకమైన, తగిన స్థాయిలోని పోలీసింగ్ చర్య అని పోలీసులు సమర్థించుకున్నారు.తీవ్రమైన నేరాలకు పాల్పడిన నిందితుల ముఖ గుర్తింపును మాత్రమే పోలీసులు పరిశీలిస్తారని, ట్రాఫిక్ చలాన్ల వంటి చిన్నపాటి నేరాలను పట్టించుకోరని ఆ అఫిడవిట్ తెలిపింది. తీవ్రమైన నేర చరిత్ర కలిగిన 2,873 మందిని ఎఫ్‌ఆర్‌ఎస్ గుర్తించిందని, వీరిలో 92 మంది 10కి పైగా కేసుల్లో ప్రమేయం కలిగి ఉన్నారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఆ 92 మందిలో 47 మంది 'నేర చరిత్ర ఉన్న వారని (హిస్టరీ-షీటర్లు), హత్య, అత్యాచారం, కిడ్నాప్, పిల్లలపై లైంగిక వేధింపుల నుండి మాదకద్రవ్యాల వినియోగం వరకు నేరాలు ఉన్నాయని తెలిపారు.
‘మఫ్టీ పోలీసుల’ మోహరింపు
సమావేశానికి లేదా ఆందోళనకు ముప్పు కలిగించే సంఘ విద్రోహ శక్తులు లేదా నేర కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి, మఫ్టీ పోలీసు సిబ్బందిని 'స్పాటర్లు'గా మోహరించడమనేది సర్వసాధారణమని పోలీసులు తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు, నేరస్థుల కంట పడకుండా ఉండేందుకు, నిరసన ప్రదేశంలో వేధింపులకు గురవుతున్న వారికి తక్షణ సహాయం అందించేందుకు మఫ్టీ పోలీసులు ఆందోళనకారులతో కలిసిపోయారని అఫిడవిట్ పేర్కొంది. చిట్టచివరి ప్రయత్నంగా టియర్ గ్యాస్ షెల్స్‌ను వినియోగించామని, లాఠీచార్జ్ పరిమితంగా, నియంత్రితంగా ఉందని తెలిపారు. గుంపు నుండి తమను తాము రక్షించుకునేందుకు లాఠీల వినియోగం ఆమోదయోగ్యమైన సహాయపరికరాలని తెలిపారు. అయితే మేకుల లాఠీల ను వినియోగాన్ని అఫిడవిట్ ఖండించింది. మేకుల లాఠీని వినియోగించారని పేర్కొంటున్న వీడియో వాస్తవానికి ఒక కర్రదని పేర్కొంది. నిరసనకారుడు ఆ కర్రను జాతీయ జెండాను ప్రదర్శించేందుకు వినియోగించివుండవచ్చని పేర్కొన్నారు. మహిళా నిరసనకారులపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలను అఫిడవిట్ ఖండించింది.








కామెంట్‌లు (0)