- 'అభిజ్ఞాన్'తో అరచేతిలో నిఘా!
- కేంద్ర ప్రభుత్వ యాప్‌పై సర్వత్రా ఆందోళన
న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా పేరుతో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు పోలీసింగ్‌ను కూడా పూర్తిగా డిజిటల్ నిఘా దిశగా తీసుకెళ్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్‌లో కేంద్ర హౌంశాఖ ప్రారంభించిన 'అభిజ్ఞాన్' యాప్ ద్వారా పోలీసులు రోడ్లపైనే వ్యక్తుల వేలిముద్రలను స్కాన్ చేసి వారి నేర చరిత్ర, పెండింగ్ కేసులు, ఇతర సున్నితమైన సమాచారాన్ని క్షణాల్లోనే తెలుసుకునే అవకాశం కల్పించింది. నేరాల నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. పౌర స్వేచ్ఛ, గోప్యత, రాజ్యాంగ హక్కులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు మరిన్ని అధికారాలు
ఇప్పటివరకు విమానాశ్రయాలు, సరిహద్దు చెక్‌పోస్టులు, పోలీసు స్టేషన్లకే పరిమితమైన బయోమెట్రిక్ ధృవీకరణను ఇప్పుడు కేంద్రం వీధుల్లోకి తీసుకొచ్చింది. పోలీసులు ఎక్కడైనా వ్యక్తిని ఆపి వేలి ముద్రలు స్కాన్ చేసి ఆయన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజలపై తనిఖీలు, ప్రశ్నలు, వేధింపులు వంటివి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మైనార్టీలు, పేదలే టార్గెట్?
భారత్‌లో ఇప్పటికే మైనార్టీలు, వలస కార్మికులు, అట్టడుగు వర్గాలపై పోలీసులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు తరచూ వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థకు బయోమెట్రిక్ స్కానింగ్ అధికారాలు ఇవ్వడం వల్ల అమాయకులు మరింత వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ యాప్‌పై స్పందిస్తూ... ''అనుమానాస్పదంగా టీ తాగుతున్నారని కూడా అరెస్టు చేసే పరిస్థితులు ఉన్న దేశంలో ఈ యాప్ ప్రజల హక్కుల దుర్వినియోగాన్ని మరింత పెంచుతుంది'' అని వ్యాఖ్యానించారు.
నిఘా రాజ్యానికి మరో అడుగు?
భారత్‌లో ప్రత్యేక నిఘా చట్టం లేకపోయినా.. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం-2023లో ప్రభుత్వానికి విస్తృత మినహాయింపులు కల్పించారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల బయోమెట్రిక్ డేటాను వారి అనుమతి లేకుండానే పోలీసులు సేకరించి వినియోగించే అవకాశం పెరిగిందని పౌర హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. సుప్రీంకోర్టు 2017లో పుట్టస్వామి కేసులో గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించినప్పటికీ... ఆ హక్కును అమలు చేసే సమగ్ర నిఘా చట్టాన్ని తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని డేటాబేస్‌లు ఒకే వేదికపై
అభిజ్ఞాన్ యాప్‌ను సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్), నాట్‌గ్రిడ్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్), ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్), ముఖ గుర్తింపు వ్యవస్థలతో అనుసంధానిస్తున్నారు. దీంతో ఒక వ్యక్తి సంచారం, నేర చరిత్ర, వ్యక్తిగత వివరాలు, ఇతర ప్రభుత్వ డేటా అన్నీ ఒకే చోట అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేరాల నియంత్రణ పేరుతో దేశవ్యాప్తంగా భారీ నిఘా వ్యవస్థను నిర్మిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
'ప్రిడిక్టివ్ పోలీసింగ్'పై భయాలు
'అభిజ్ఞాన్' కేవలం వ్యక్తిగత వివరాలు చూపించే యాప్ మాత్రమే కాదు. భవిష్యత్తులో నేరాలు జరిగే అవకాశాలను అంచనా వేసే 'ప్రిడిక్టివ్ పోలీసింగ్' వ్యవస్థకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే అమెరికా, j¶రప్‌లో ఇలాంటి వ్యవస్థలు మైనార్టీలు, వలసదారులు అధికంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వివక్షకు దారితీశాయని అధ్యయనాలు వెల్లడించాయి. కుల, మత, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్న భారత్‌లో ఇలాంటి సాంకేతికత మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విద్యార్థి ఉద్యమాల నుంచే ఆందోళన
ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల సందర్భంగా పోలీసులు ప్రత్యక్ష కెమెరాలు, డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ ద్వారా సేకరించిన చిత్రాలను ముఖ గుర్తింపు వ్యవస్థలతో అనుసంధానం చేశారని పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. నిరసనల్లో పాల్గన్న వారిపై బయోమెట్రిక్ మ్యాపింగ్ చేసినట్టుగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అభిజ్ఞాన్ వంటి యాప్‌లు ప్రభుత్వ నిఘా సామర్థ్యాన్ని మరింత విస్తరించే సాధనాలుగా మారతాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
ప్రజాస్వామ్యానికి పరీక్ష
నేరాల దర్యాప్తును వేగవంతం చేయడం అవసరమే అయినప్పటికీ.. ప్రజల గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను పక్కనబెట్టి నిఘా వ్యవస్థలను విస్తరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని నిపుణులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. స్వతంత్ర పర్యవేక్షణ, పారదర్శక చట్టాలు, న్యాయపరమైన రక్షణలు లేకుండానే మోడీ ప్రభుత్వం బయోమెట్రిక్ నిఘా వ్యవస్థలను వేగంగా విస్తరిస్తోందనే విమర్శలు మరింత బలపడుతున్నాయి.







కామెంట్‌లు (0)