జైపూర్ : తమ బృందంపై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకులుగా ఉండిపోయారని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) కన్వీనర్ అభిజీత్ దీప్కే విమర్శించారు. ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా జైపూర్‌లోని రాంపుర కన్వర్‌పుర గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు వెళ్లిన సిజెపి బృందాన్ని బిజెపి గూండాలు అడ్డుకున్నారు. సిజెపి సహ-కన్వీనర్ అశుతోష్ రాంకాతోపాటు పార్టీ కార్యకర్తలపై వారు దాడికి దిగారు. అనంతరం సిజెపి కార్యకర్తలను గ్రామం నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై అభిజీత్ దీప్కే శుక్రవారం రాజస్థాన్ పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు వెళ్లిన సిజెపి వాలంటీర్లపై దాడులు జరుగుతున్నా రాజస్థాన్ పోలీసులు ప్రేక్షకులుగా ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు పశువుల కొట్టాల్లో నిర్వహించడం పోలీసులకు సమస్యగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. పశువుల కొట్టాల్లో నిర్వహించడం సమస్యగా అనిపించలేదని, తమ కార్యకర్తలు ఆ పాఠశాలల్లోకి వెళ్లడం మాత్రం వారికి సమస్యగా మారిందని విమర్శించారు. గ్రామంలోని పాఠశాల భవనాన్ని అసురక్షితంగా ప్రకటించడంతో దాన్ని మూసివేసి, ప్రస్తుతం సమీపంలోని పశువుల కొట్టంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అశుతోష్ రాంకాతోపాటు సిజెపి వాలంటీర్లపై బిజెపి గూండాలు దాడి చేశారని, అశుతోష్‌తో పాటు ఇతర కార్యకర్తలు గాయపడ్డారని, కానీ పోలీసులు స్పందించలేదని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.
జైపూర్ జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించేందుకు సిజెపి బృందం శుక్రవారం పర్యటించాల్సి ఉంది. రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రజలు, మీడియా ప్రతినిధుల ప్రవేశంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. సిజెపి గతంలో నిర్వహించిన పాఠశాలల తనిఖీల నేపథ్యంలో, సరైన కారణం లేకుండా బయటి వ్యక్తులు, మీడియా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా రాష్ట్ర విద్యాశాఖ ఆంక్షలు విధించినట్లు సమాచారం.








కామెంట్‌లు (0)