- తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో కలకలం
ఆగ్రా : తమిళనాడు ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో వదిలిపెట్టిన ఓ ట్రాలీ బ్యాగ్‌లో కుళ్లిపోయిన మానవ శరీర భాగాలు లభ్యమవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం, గ్వాలియర్ దాటిన అనంతరం రైలు ఆగ్రా కంటోన్మెంట్‌కు చేరుకునే సమయంలో జనరల్ కోచ్‌లో ఉన్న ఎర్రటి ట్రాలీ బ్యాగ్ నుంచి రక్తపు మరకలు, దుర్వాసన వస్తున్నట్లు ఓ ప్రయాణికుడు గుర్తించాడు. వెంటనే రైల్వే హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. బుధవారం ఉదయం సుమారు 5.30 గంటలకు రైలు ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్‌కు చేరుకోగానే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ అధికారులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. అందులో కుళ్లిపోయిన మానవ చేయితో పాటు ఇతర శరీర భాగాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. బ్యాగ్‌లో శరీర భాగాలను చుట్టడానికి ఉపయోగించిన ఓ కవర్ కూడా లభించింది. దానిపై చెన్నైకి చెందిన ఓ సంస్థ పేరు, లోగో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడిని వేరే ప్రాంతంలో హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి రైల్లో వదిలివేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన జీఆర్‌పీ ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. చెన్నై నుంచి ఆగ్రా వరకు ఉన్న రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు, అదృశ్యమైన వ్యక్తుల వివరాలు, డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతుడి గుర్తింపునకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.








కామెంట్‌లు (0)